కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజూ 1,500 మంది – 1,600 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారని, వారికి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. 85 పడకల కొత్త ఆస్పత్రి భవనం వద్ద అంతర్గత రహదారులు, లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసందర్భంగా పలు విభాగాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, ఆస్పత్రి సూపరింటెండెంట్ హిమబిందుసింగ్, ఆర్‌ఎంవో కృపాబాయి, ఏఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
అల్పాహారం ఎలా ఉంది?
కమాన్‌పూర్: విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతోపాటు చదువుపై ఏకాగ్రత సాధించేందుకు అల్పాహారం దోహదపడుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి అల్పాహారం నాణ్యత పరిశీలించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. నాణ్యత, రుచితోపాటు పాలు, రాగిజావా అందుతుందా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎం రాజేశ్వరరారవు, ఉపాధ్యాయులు ఉన్నారు.
పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన
పెద్దపల్లి: పౌష్టికాహారం ప్రాధాన్యత, పోషక విలువలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన పోషణ్ మహాపోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి, రామగుండం, సీడీపీవోలు అనిత, అలేఖ్య పటేల్, మంథని ఇన్‌చార్జి సీడీపీవో పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


