ఏడాది నుంచి బీమా కంపెనీకే సర్వాధికారాలు మంచిర్యాల జిల్లా నుంచే క్లెయిమ్‌లు పరిష్కారం అక్కడి నుంచి దరఖాస్తు అందితే వెంటనే నిధులు విడుదల! కార్మికుల సంక్షేమ బోర్డు లీలలు
పెద్దపల్లిరూరల్: కార్మిక సంక్షేమబోర్డు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న అధికారులు, బీమా కంపెనీ ప్రతినిధులకు సంపూర్ణ సహకారాలు అందించి అప్పనంగా ప్రజాధనం దోచుకునేందుకు అవకాశమిచ్చారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన బీమా కంపెనీ ప్రతినిధి తన కుటుంబీకుల పేరిట బోగస్ బిల్లులను క్లెయిమ్ చేసుకునేందుకు చేసిన యత్నాలు ఫలించకపోవడంతో అవే దరఖాస్తులను పొరుగున ఉన్న మంచిర్యా ల జిల్లా కార్మిక శాఖ కార్యాలయం నుంచి క్లెయిమ్ చేశారు. ఇదెలా సాధ్యమంటే.. కార్మిక సంక్షేమ బోర్డులోని కొందరు అధికారులే చక్రం తిప్పారు. దరఖాస్తు అందడమే ఆలస్యం.. ఆగమేఘాల మీద అంటే.. ఒకట్రెండురోజుల్లోనే నిధులు కూడా బ్యాంకు ఖాతాలో జమకావడం గమనార్హం.
బీమా కంపెనీకే సర్వాధికారాలు
రాష్ట్ర ప్రభుత్వం భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం 1996లో అమల్లోకి తీసుకొచ్చిన భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నిర్మాణ రంగ కార్మికులకు(తాపీమేసీ్త్ర, ఎలక్ట్రీగషియన్, ప్లంబర్, పెయింటర్, టైల్స్, వడ్రంగి, వడ్డెర తదితర నిర్మాణ రంగ కార్మికులై ఉండాలి) లేబర్ కార్డులు మంజూరు చేసింది. కార్డు పొందేందుకు ముందున్న ఏడాదిలో కనీసం 90 రోజులకు తగ్గకుండా పనిచేసిన వారికే కార్డు అందించాలి. కానీ, ఏ పనికీ వెళ్లని, అనర్హులకు కార్డులు జారీచేశారు. లేబర్‌కార్డు పొందినవారు సహజ, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా, అంగవైకల్యం పొందినా బీమా పరిహారం పొందేందుకు క్లెయిమ్ చేసుకోవాలి. వారిదరఖాస్తుపై కార్మిక శాఖ అధికారులు విచారణ జరిపి నిధుల మంజూరుకు రెఫర్ చేసేవారు. గతేడాది జూలై నుంచి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సంపూర్ణ అధికారాలను సదరు బీమా సంస్థకే కట్టబెట్టింది.
బోగస్ బిల్లులతో నిధులు స్వాహా
సదరు బీమా సంస్థకు ప్రభుత్వం సంపూర్ణాధికారం ఇవ్వడంతో దాని ప్రతినిఽధులు బోగస్ బిల్లులు కూడా కాదు.. కేవలం తెల్లకాగితాలతోనే నిధులు స్వాహా చేసేందుకు తెరలేపారు. కార్మికులకు బీమా పరిహారం అందించే బీమా సంస్థకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఆర్డినేటర్‌గా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవహరిస్తూ.. తన కుటుంబసభ్యుల పేరిట తప్పుడు దరఖాస్తులతో పరిహారం పొందినట్టు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్మిక బీమా వ్యవహారాలను పర్యవేక్షించే కో ఆర్డినేటర్ తన బంధుమిత్రులు, కొన్నిప్రాంతాల్లో యువకులను ఏజెంట్లుగా నియమించుకుని ఇలాంటి క్లెయిమ్‌లు చేయించి.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు చర్చ జోరుగా సాగుతోంది.
పెద్దపల్లివాసి.. మంచిర్యాలలో క్లెయిమ్
పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బీమా సంస్థ ప్రతినిధి తన కుటుంబీకుల పేరిట బోగస్ బిల్లులను చేసుకునేందుకు పంపినట్టు గుర్తించిన ఇక్కడి అధికారులు.. వాటిని పక్కన బెట్టగా.. కార్మిక సంక్షేమ బోర్డులోని అధికారులతో మిలాఖతై వారి సహకారంతో ఈ క్లెయిమ్‌లను మంచిర్యాల కార్మిక శాఖ కార్యాలయానికి బదిలీ చేసి కేవలం గంటల్లోనే నిధులు వారిఖాతాలో జమచేసినట్టు సమాచారం. ఇలా పెద్దపల్లి జిల్లా నుంచే కాకుండా ఇంకా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన డెత్ క్లెయిమ్‌లు మంచిర్యాల నుంచే జరిగినట్టు సమాచారం.
అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి!
పెద్దపల్లి జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయని, అధికారి విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదని ఉన్నతాధికారులు, కార్మికమంత్రి వివేక్ దృష్టికి కొందరు తీసుకెళ్లారు. దీంతో సదరు అధికారి విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఇటీవల బాధ్యతల నుంచి తప్పించారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న అధికారి అక్కడే కొనసాగే అవకాశమున్నా.. ఆయన పెద్దపల్లి జిల్లా అదనపు బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు బాధ్యతలను తీసుకున్న అధికారికి బీమా క్లెయిమ్, చెల్లింపుల వివరాలు కావాలంటూ పెద్దనపల్లి సోమగూడేనికి చెందిన కల్వల శరత్‌కుమార్ సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని సమాచారం పొందడంతో ఈ వ్యవహారమంతా బయటకు పొక్కింది. అయితే పెద్దపల్లిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి.. మంచిర్యాలలోనే ఉంటే ఈ విషయం ఇప్పటికీ గుట్టుగానే ఉండేదని కార్మికశాఖ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


