పెద్దపల్లి: ఉద్యోగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27 నుంచి సెప్టెంబరు 10వ తేదీ వరకు దశలవారీగా ఉద్యమాలు చేపట్టామని, వీటిని విజయవంతం చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. 27న జిల్లా కేంద్రంలో మహాధర్నా, సెప్టెంబర్ 1న పింఛన్ విద్రోహ దినం, సెప్టెంబరు 10న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నాయకులు గోపు అనిత, కొమురయ్య, ఆడెపు శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, సౌమ్య, స్వప్న, అడ్ల పురుషోత్తంరెడ్డి, నూకల శంకర్, జగన్, సరిత, నాయిని భాగ్యమ్మ, రాజిరెడ్డి పాల్గొన్నారు.
‘కలుపు’పై అవగాహన
రామగిరి: కేవీకే, రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తలు శుక్రవారం కల్వచర్లలో రైతులకు పార్టీనియం మొక్క నిర్మూలనపై అవగాహన కల్పించారు. పంటలు, మనుషులు, జంతువులకు ఈ కలుపు మొక్కతో కలిగే నష్టాల గురించి వివరించారు. పత్తి, కంది పంటలతోపాటు పొలంగట్లపై అధికంగా ఉండి దిగుబడిని 35 శాతం వరకు తగ్గిస్తుందని తెలిపారు. మనుషులకు, జంతువులపై విషపూరిత ప్రభావం చూపుతుందని, ఈ మొక్కపూత రాకముందే తొలగించి ఖాళీ ప్రదేశాల్లో కాల్చివేస్తే శాశ్వతంగా నిర్మూ లన చేయొచ్చని తెలిపారు. శాస్త్రవేత్తలు వెంకటరమేశ్, వెంకన్న, టి.వినోద్ కుమార్, కిరణ్ పిల్లి, ఏఈవో ఆరవింద్, రైతులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చేయూత
జ్యోతినగర్: విద్యార్థుల సాధికారతకు ఎన్టీపీసీ చేయూత ఇస్తోందని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాకీ సామంత అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌కు 40 డ్యూయల్ డెస్క్ బెంచీలు, యోగా మ్యాట్‌లు, క్రీడా దుస్తులను శుక్రవారం ఆమె పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఎన్టీపీసీ పలు కార్యక్రమాలను చేపడుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డీపీఆర్వోగా తిరుమల
పెద్దపల్లి: జిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో)గా బి.తిరుమల నియమితుల య్యారు. ఈమేరకు ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా తిరుమల కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీపీఆర్వోగా తిరుమల బాధ్యతలు స్వీకరించారు.


