‘భీమన్న చెరువు’కు గ్రీన్‌సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

‘భీమన్న చెరువు’కు గ్రీన్‌సిగ్నల్‌

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

● భూసేకరణకు రూ.5.40 కోట్లు ● రెండు నెలల్లో ప్రక్రియ పూర్తికి ఆదేశాలు ● రూ.14 కోట్లతో చెరువు పనులు

● భూసేకరణకు రూ.5.40 కోట్లు ● రెండు నెలల్లో ప్రక్రియ పూర్తికి ఆదేశాలు ● రూ.14 కోట్లతో చెరువు పనులు

ధర్మారం: కానంపెల్లి గ్రామ శివారులో ప్రతిపాదిత భీమన్న చెరువు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. చెరువు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు ప్రభుత్వం రూ.5.40 కోట్లు విడుదల చేసింది. హైదరాబాద్‌ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్షతోపాటు నీటిపారుదలశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. నీటిపారుదల ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌ భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ, ధర్మారం మండలం కానంపెల్లి గ్రామ శివారులో చెరువు నిర్మాణం కోసం భూసేకరణకు రూ.5.40కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు

కానంపెల్లి గ్రామ శివారులో చెరువు నిర్మాణం కోసం రైతులు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. చెరువు నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుండటంతోపాటు భూగర్భ జలాలు వృద్ధిచెంది వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యను విన్నవిస్తూ వస్తున్నారు. చెరువు నిర్మాణం చేపట్టాలని కోరుతూ వచ్చారు.

గతంలో నిధులు మంజూరైనా..

గత ప్రభుత్వం చెరువు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా.. అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేక భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో చెరువు నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. సమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కాకపోవడంతో అన్నదాతల్లో తీవ్ర నిరాశ నెలకకొంది.

మంత్రి లక్ష్మణ్‌ చొరవతో నిధులు..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కానంపెల్లికి చెంది న రైతు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి భీమన్న చెరువు సమస్య గురించి వివరించారు. స్పందించిన మంత్రి.. రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో రెండు శాఖల అధికారులు సమన్వయంతో సమస్యను పరిష్కరించి అవసరమైన వివ రాలు, భూసేకరణ నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. అధికారుల నివేదిక, రైతుల విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్‌.. తాజాగా భూసేకరణకు రూ.5.40 కోట్లు విడుదల చేసింది. నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తిచేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

రూ.14 కోట్లతో చెరువు నిర్మాణం

భూసేకరణ పూర్తయిన తర్వత దాదాపు రూ.14కోట్ల అంచనా వ్యయంతో భీమన్న చెరువు నిర్మాణం చేపట్టనున్నట్లు ఇరిగేషన్‌ డీఈఈ రమేశ్‌ స్పష్టం చేశారు. వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్న రైతులకు చెరువు అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement