కరీంనగర్‌లో హత్యచేసి ఎల్కతుర్తిలో వదిలేసి.. | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో హత్యచేసి ఎల్కతుర్తిలో వదిలేసి..

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

కారు డిక్కీలోని మహిళ మానసగా గుర్తింపు

మృతురాలిది పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత

పోలీసుల అదుపులో నిందితుడు

ఎల్కతుర్తి: ఓ మహిళను కరీంనగర్‌లో హత్యచేసి కారు డిక్కీలో తీసుకునివచ్చి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో వదిలేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళది పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీగా గుర్తించారు. ఎల్కతుర్తి సీఐ రమేశ్‌, ఎస్సై నరసింహారావు కథనం ప్రకారం.. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపలోని కాలనీలో(టీఎస్‌03 ఎఫ్‌ఎఫ్‌ 8034) అనే నంబర్‌ గలకారు అనుమానాస్పదంగా పార్కు చేసి ఉంది. దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారువద్దకు చేరుకొని వాకబ్‌ చేయగా మండల కేంద్రానికి చెందిన తంగెళ్లపల్లి సదానందందని తేలింది. ఆయనను ఘటనా స్థలానికి రప్పించారు. తన కారును ఎడెల్లి భాస్కర్‌రెడ్డికి కుదవపెట్టినట్లు సదానందం తెలిపాడు. కాగా కారును ఎల్కతుర్తికి చెందిన భాస్కర్‌రెడ్డి సోదరుడు వినోద్‌రెడ్డి వాడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. ఓనరైన సదానందం వద్ద ఉన్న మరో తాళం చెవితో డిక్కీ తెరిచి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. స్థానిక కార్యదర్శి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. కారులో లభించిన అధార్‌కార్డు ఆధారంగా పెద్దపల్లి జిల్లా రామగిరి పరిధిలోని సెంటినరీకాలనీకి చెందిన అంకతి మానస(33)గా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఘటనస్థలానికి చేరుకుని తమ కూతురు మానస, వినోద్‌రెడ్డి స్నేహితులని తెలిపారు. వారిద్దరు కరీంనగర్‌లో కలుసుకున్నారని, అక్కడే మానసను హత్యచేసి కారులో ఎల్కతుర్తికి తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏంచేయాలో పాలుపోక కారులోనే ఉంచినట్లు సమాచారం. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితుడిగా భావిస్తున్న వినోద్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో పూర్తి వివరాలు తేలియజేస్తామని డీసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement