జ్యోతినగర్: చేతిలో సెల్‌ఫోన్.. గంటల తరబడి గేమ్స్ ఆడడం.. నిత్యం సోషల్ మీడియాపై దృష్టి సారించడం విద్యార్థుల దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. ఇలాంటి వారిని డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి మైదానం వైపు నడిపించేందుకు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు సీనియర్ క్రీడాకారులు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఫిజికల్ డైరెక్టర్ సుధీష్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ కొనసాగుతోంది.
ఆసక్తి ఉన్నవారికి..
క్రికెట్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లు, ఫిట్‌నెస్ వంటి అంశాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. కేవలం ఆటలో నైపుణ్యం సాధించడమే కాకుండా సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, ఓటమిని స్వీకరించే మనస్తత్వం వంటి జీవిత విలువలూ పెంపొందిస్తున్నారు.
మైదానమే మంచి మార్గం
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం, సెల్‌ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంచడం తల్లిదండ్రు లు, విద్యాసంస్థలు, సమాజం ఉమ్మడి బా ధ్యత. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్‌షిప్‌లో కొనసాగుతున్న క్రికెట్ కోచింగ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరింత మంది మైదానం వైపు అడుగులు వేస్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.


