రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2016 నుంచి ఇప్పటివరకు నీటి తరలింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన మంత్రులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా ఎన్టీపీసీ, హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు, వివిధ పరిశ్రమలు, సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకున్న నీటికి చెల్లించిన రుసుంతో సుమారు రూ.648 కోట్లు సమకూరినట్లు వారు వివరించారు. భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ప్రతీ టీఎంసీ నీటి వినియోగానికి రూ.7.16 కోట్లు రుసుం వసూలు చేస్తున్నారు. పరిశ్రమలు, తాగునీటి రంగం, మత్స్య సంపద, మైనింగ్ డీసిల్టేషన్ ద్వారా వచ్చే ఆదాయాలు వేర్వేరుగా ఉంటాయి.
‘ఖని’లో ఫ్లెక్సీల యుద్ధం
గోదావరిఖని: సింగరేణి స్థలాల్లోని కట్టడాల పై ఫ్లెక్సీల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ సీపీఐగా వివాదం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఎల్‌బీనగర్‌లో నిర్మించిన క ట్టడాల వద్ద లబ్ధిదారుల పేర్లను రాయాలని కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సీపీఐ నాయకులు మంగళవారం తిలక్‌నగర్‌లో సింగరేణి స్థలంలో కొనసాగుతున్న నిర్మాణం వద్ద లబ్ధిదారుల పేర్లను ప్రకటించాలని ఫ్లెక్సీ కట్టి సవాల్ చేశారు. ప్రతిస్పందించిన కాంగ్రెస్ నాయకులు.. లబ్ధిదారుల పేర్లను ఆ ఫ్లెక్సీపై రాసి తాము క్లియర్‌గా ఉంటామని స్పష్టం చేశారు. సింగరేణి స్థలాల్లో కొనసాగుతున్న కట్టడాలపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే.
ఎంఎస్‌ఎంఈడీలకు ప్రయోజనం
పెద్దపల్లి: వ్యాపార వివాదాలను వేగంగా పరిష్కరించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈడీ సవరణ బిల్లు–2026 ప్రవేశపెట్టిందని జిల్లా పరిశ్రమల మేనేజర్ కీర్తికాంత్ తెలిపారు. దీనిద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యమైతే పరిష్కారం కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమల సదుపాయ మండలి, కరీంనగర్‌ను ఆశ్రయించాలని సూచించారు.


