పల్లెకు ‘బెల్ట్‌’ మత్తు | - | Sakshi
Sakshi News home page

పల్లెకు ‘బెల్ట్‌’ మత్తు

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

పెద్దపల్లిరూరల్‌: ఎనీ టైం మద్యం.. ఏ రకమైన బ్రాండ్‌ కావాలన్నా పల్లెప్రాంతాల్లోని బెల్ట్‌షాపుల్లో లభిస్తోంది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తలపించేలా నిర్వాహకులు వంటకాలు సైతం నిమిషాల్లో వండి వడ్డిస్తున్నారు. మందుబాబులను మజాలో ముంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పల్లెల్లో బెల్ట్‌ దందా ‘మూడు మద్యం సీసాలు.. ఆరుపెగ్గులు’ చందంగా లాభసాటిగా సాగుతోంది. దీంతో కొందరు పోటీపడుతూ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ప్రతీఊరిలో 20 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. అధికారికంగా ఇచ్చే వైన్స్‌, బార్‌ షాపులకు నిబంధనలు ఉంటాయి. కానీ, బెల్ట్‌షాప్‌లకు అవేమీ వర్తించడంలేదు. గుడి, బడికి చెంతనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి.

బార్లను తలపించేలా..

పెద్దపల్లి శివారుతోపాటు పలు పల్లెల్లో కొందరు నిర్వాహకులు బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబుల ఆర్డర్‌ను బట్టి మటన్‌, చికెన్‌, గుడ్లతో కూడిన వంటకాలు, గుడాలు నిమిషాల్లో వండి సిద్ధం చేసి వడ్డిస్తున్నారు. చపాతీ, రైస్‌ కూడా వండి పెడుతుండడంతో నలుగురైదుగురు కలిసి విందులు చేసుకునేందుకు బెల్ట్‌ షాపులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ దందా జోరుగా సాగుతోంది. రాత్రి 10 గంటలు దాటితే మద్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.80 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

ఆదర్శగ్రామం.. ఆగమాగం

పెద్దపల్లి మండలం నిట్టూరులో మహిళా సంఘాల సభ్యులు ఉద్యమించడంతో అమల్లోకి వచ్చిన మద్య నిషేధం దాదాపు 14ఏళ్ల పాటు అమలైంది. ఇప్పుడు వాడకో రెండు, మూడు బెల్ట్‌షాప్‌లు వెలిశాయి. ఇక్కడ మద్యం తాగేసమయంలో పంచా యతీ ఎన్నికల ప్రస్తావన రావడంతో ఓ ఇద్దరి మ ధ్య మాటామాట పెరిగి తన్నులాడుకునే దాకా వెళ్లింది. ఈమేరకు పెద్దపల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు, కేసులు వరకూ వెళ్తోంది.

మత్తుకు బానిసలు..

బెల్ట్‌షాపుల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉంటోంది. కొందరు మత్తుకు బానిస అవుతున్నారు. దినసరి కూలీలు, చేతివృత్తుల వారు మద్యం మత్తులో బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. పాతికేళ్ల క్రితం పెద్దపల్లికి వలస వచ్చిన ఓ కూలీ మద్యం మత్తులో ఇటీవల బావిలో పడి మరణించాడు. ఇలాంటి ఘటనల్లో వారి భార్యాపిల్లలు రోడ్డున పడుతున్నారు. శుభ, అశుభ, బర్త్‌డే లాంటి కార్యక్రమాల పేరిట యువత, విద్యార్థులు మద్యం తాగేందుకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు.

తనిఖీలు చేస్తున్నాం

పల్లెల్లో మద్యం అమ్మకాలను నియంత్రించేందుకు తనిఖీలు చేస్తున్నాం. మద్యం, గుడుంబా రవాణాదారులపై దృష్టి సారించాం. గుడుంబా తయారీ, రవాణాదారులను గుర్తించి బైండోవర్‌ చేశాం. ఫిర్యాదులు అందితే సత్వరమే స్పందిస్తాం.

– నాగేశ్వర్‌రావు, సీఐ, పెద్దపల్లి

గ్రామాల్లో ఎనీటైం మద్యం

ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులు

ఊరూరా పెద్దసంఖ్యలో ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement