● అంతర్గాంపై దృష్టి సారించని కేంద్ర విమానయాన శాఖ ● ఆదిలాబాద్, మామునూర్‌పైనే శ్రద్ధ
రామగుండం: జిల్లాలోని అంతర్గాం మండలకేంద్రంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానశ్రయం ఏర్పాటుపై కేంద్ర విమానయాన శాఖ అంతగా ఆసక్తి చూపడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదిలాబాద్, మామునూర్ ప్రాంతాల్లోనే బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 నాటికి ప్రజలకు విమానయాన సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనులు పూర్తి చేయనున్నట్లు స్పష్టంగా పేర్కొంటున్నారు.
ప్రతిపాదించడం.. రద్దు చేయడం
అంతర్గాం మండలంలో పలు పరిశ్రమల స్థాపనకు భూ పరిశీలన, సర్వేలు చేసి అంతలోనే రద్దు చేయ డం పరిపాటిగా మారింది. మూడు దశాబ్దాల క్రిత మే ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలు రాగా భూములను సైతం పరిశీలించారు. తర్వాత మహిళా పాలిటెక్నిక్ ప్రతిపాదించి చివరకు సిరిసిల్లకు తరలించారు. పో లీస్ బెటాలియన్ ప్రతిపాదించి గుడిపేటలో ఏర్పా టు చేశారు. మెడికల్ కళాశాల ప్రతిపాదించినా చివరకు గోదావరిఖనిలోనే నిర్ణయించారు. అలాగే ముర్రా జాతి గేదెలు, మేకల పరిశోధన కేంద్రాల సర్వేలు, నిధుల కేటాయింపు ప్రక్రియ జరిగినట్లు అధికారులు పేర్కొన్నా.. చివరకు ఏమీ లేదు. గత ప్రభుత్వ హయంలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని భూసర్వే చేసినా ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ కూడా ఏర్పాటవుతుందా ఊరించి ఊసురుమనిపిస్తారా అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
అంతగా శ్రద్ధచూపని కేంద్ర విమానయాన శాఖ
తొలిసారిగా స్థాపించే ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్‌గా, అప్పటికే పాత ఎయిర్‌పోర్టులు ఉన్న ప్రాంతా న్ని బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా పరిగణిస్తారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్, మామునూర్ బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ఉండగా వినియోగంలో లేకపోవడంతో అదే ప్రాంతంలో ఇప్పటికే సమృద్ధిగా వనరుల (భూమి, ఇతరత్రా) లభ్యత ఉండడంతో నూతన ఎయిర్‌పోర్టుల స్థాపనకు తొలుత కేంద్రం వాటిపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గాంలో ఎయిర్‌పోర్ట్ స్థాపనకు 591 ఎకరాల భూమి ఉన్నా, భవిష్యత్‌లో ఎయిర్‌బస్ ఏ 320 రకం పెద్ద విమానాల ల్యాండింగ్‌తో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రక్షణ అవసరాలకు కనీసం 950 ఎకరాలు అవసరం. మిగత 450 ఎకరాల భూ సేకరణ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సాంకేతికంగా అంతర్గాం సైట్ క్లియరెన్స్ ప్రక్రియ కొనసాగుతుండగా, కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉన్నట్లు తెలిసింది.
ఎయిర్‌పోర్ట్ ఏర్పాటే లక్ష్యం
ఇటీవల ఆదిలాబాద్, మామునూర్ ఎయిర్‌పోర్ట్ స్థాపన విషయంలో కేంద్ర పౌర విమానయానశాఖ చూపిస్తున్న శ్రద్ధ అంతర్గాంపై చూపించడం లేదు. ఇప్పటికే సంబంధిత మంత్రిని కలిసి చర్చించా. అంతర్గాంలో విమానశ్రయం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తుతా. విమానాశ్రయం, ఈఎస్‌ఐ, రామగుండం–మణుగూర్ రైల్వే ప్రాజెక్టు తీసుకురావడం నా ప్రధాన లక్ష్యం.
– గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ


