పెద్దపల్లిరూరల్: జిల్లాలో భూ సంబంధమైన సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి పోర్టల్ ద్వార రీ సర్వే నిర్వహించి ఆ వివరాలు ఆన్‌లైన్ లో నమోదు చేసిన అనంతరం భూదార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రీ సర్వే, భూభారతి పోర్టల్‌పై అవగాహన కల్పించారు. జిల్లాలో 190 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, తొలివిడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేస్తున్నామని వివరించారు. గ్రామాల సరిహద్దులు నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములు, ఇళ్ల హద్దుల వివరాలను ఆన్‌లైన్ నమోదు చేస్తారన్నారు. సర్వే పూర్తయ్యాక అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు ఇస్తామని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో 99శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని వివరించారు. రీ సర్వే నిర్వహించే తేదీ, సమయాన్ని ముందుగానే చెబుతారని ఆ సమయంలో ప్రజలు, రైతులు అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలన్నారు. తహసీల్దార్ రాజయ్య, సర్పంచ్ నూనె సరోజన తదితరులు పాల్గొన్నారు.


