కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తిపన్ను వసూళ్లే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు 2026–27 ఆర్థిక సంత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందుగా చెల్లించే వారికి ఎర్లీబర్డ్ ఆఫర్ పేరిట ఆస్తిపన్నులో ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తున్నాయి. తద్వారా నిర్దేశిత లక్ష్యం కన్నా అధికంగా వసూలు చేయాలని ప్రణాళిక రూపింంచాయి. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తిపన్ను రికార్డుస్థాయిలో వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ స్కీంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కార్పొరేషన్ కేటగిరీలో అగ్రస్థానం
రామగుండం కార్పొరేషన్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఆస్తిపన్ను వసూళ్లలో అత్యధిక శాతం వసూలు సాధిం కార్పొరేషన్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.19 కోట్ల 22 లక్షల 97 వేలు ఉండగా, రూ.14కోట్ల 47 లక్షల 67వేలు వసూలయ్యాయి. దీంతో ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్ పొందడానికి అర్హత సాధించినట్లయింది.
ప్రజలకు అవగాహన
రామగుండం నగరపాలక సంస్థ అధికారులు ఎర్లీబర్డ్ స్కీం ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9కోట్ల వరకు ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బిల్‌కలెక్టర్లు ఆస్తిపన్ను నమోదు చేయడానికి ఉపయోగించే హ్యాండ్ మిషన్లలో 5 శాతం రాయితీ కలిగిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు.
పరిశ్రమలకు లేఖలు
రామగుండం బల్దియాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.18.95 కోట్ల వరకు డిమాండ్ ఉంది. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి, జెన్‌కో తదితర ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది ఎన్టీపీసీ రూ.3.88కోట్లు, ఆర్‌ఎఫ్‌సీఎల్ రూ.1.8కోట్లు, సింగరేణిలోని ఆర్జీ–1 ద్వారా రూ.73.76లక్షలు, ఆర్జీ–2 ద్వారా రూ.43.37లక్షలు, జెన్‌కో ద్వారా రూ.5.99 లక్షల వరకు ఆస్తిపన్ను చెల్లించాయి. ఈఏడాది ఎర్లీబర్డ్ ఆఫర్‌లో కూడా ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు సింగరేణి, జెన్‌కో నుంచి కూడా ముందుస్తు ఆస్తిపన్ను చెల్లించేలా ఆయా సంస్థలకు లేఖలు పంపించారు. అలాగే రైస్‌మిల్లులతోపాటు బడా వ్యాపారులకూ అవగాహన కల్పించి ముందస్తు ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
రామగుండంలో ఎర్లీబర్డ్ వసూళ్లు
ఆర్థిక సంవత్సరం వసూలు(రూ.కోట్లలో)
2019–20 0.8292
2020–21 1.13
2021–22 1.14
2022–23 1.55
2023–24 1.54
2024–25 1.60
2025–26 9.7
పురపాలికల్లో ముందస్తు వసూలుకు కార్యాచరణ
ముందుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం రాయితీ
ఈనెల 30లోగా చెల్లిస్తేనే పథకం వర్తింపు
ప్రత్యేక దృష్టి సారించిన మున్సిపల్ కమిషనర్లు


