● వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యం
● రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి
గోదావరిఖని: అలైవ్ అరైవ్ కార్యక్రమంలో వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వామ్యులుగా చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐబీకాలనీలో రూ.12.29కోట్లతో నిర్మించిన నూతన ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు. కమిషనరేట్‌లో సాయుధ పోలీసు సిబ్బంది గౌరవవందనం సమర్పించి డీజీపీకి స్వాగతం పలికారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయన్నారు. వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అనే సందేశాన్ని ప్రతీ ఒక్కరికి చేరేలా సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల కుటుంబ సభ్యుల అనుభవాలు, అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా అవగాహన మరింత పెరుగుతుందన్నారు.
నూతన క్వార్టర్లు ప్రారంభించిన డీజీపీ
గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్‌ను ఆదివారం డీజీపీ శివధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా, టీజీపీఐసీఎస్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం, జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గీత్, ఎసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


