ముదిరిన ఎండలతో పిల్లల్లో పెరుగుతున్న డీహైడ్రేషన్ సమస్యలు స్కూళ్లలో పనిచేయని బోర్లు, వాటర్ ప్లాంట్లు ఇంటి నుంచి తీసుకెళ్లిన సీసాలే విద్యార్థులకు దిక్కు నీరు తాగేలా ప్రోత్సహిస్తేనే పిల్లల ఆరోగ్యానికి మేలు
మనిషి నిత్యం కనీసం 3నుంచి 3.5లీటర్ల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియ అనంతరం వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, మలబద్ధకం నివారణకు తోడ్పడుతుంది.
డీహైడ్రేషన్ కాకుండా, అలసట, తలనొప్పి, మెదడు మొద్దుబారకుండా ఉండటం, కండరాలు పట్టేయటం వంటి సమస్యలను నిరోధిస్తుంది.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా వాటి పనితీరును
మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.
సాక్షి పెద్దపల్లి: ఫస్ట్‌బెల్.. సెకండ్ బెల్.. ఇంటర్వెల్.. ఇంటి బెల్ వంటివి విద్యార్థుల్లో ప్రాచుర్యం పొందిన బడిగంటలు. వీటితో పాటు గతంలో కొన్ని రోజులు వినిపించిన ‘వాటర్ బెల్’ ఇప్పుడు ఏ పాఠశాలల్లో మోగటం లేదు. జిల్లాలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులు తగినంత నీరు తాగేలా తప్పనిసరిగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు చదువు, ఆటల్లో నిమగ్నమై నీళ్లు తాగకపోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలామంది ఇంటి నుంచి వాటర్‌బాటిళ్లు తీసుకెళ్తున్నారు. కేవలం మధ్యాహ్నం సమయంలోనే అన్నం తినేటప్పుడే ఆ నీటిని తాగుతున్నారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో నీటిని సరిగా తీసుకోక వ్యాధులకు గురువుతున్నారు. సరిపడా నీటిని తాగకపోవడంతో మూత్రకోశ వ్యాధులతో పాటు డీహైడ్రేషన్ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.
గతంలో అమలు చేసినా..
విద్యార్థి దశ నుంచి పిల్లలు తగినంత నీరు తాగేలా కేరళ రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేకంగా నీటి గంట విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని స్ఫూరిగా తీసుకొని గతంలో జిల్లాలో అక్కడక్కడ అమలు చేసినా, తర్వాత అది మరుగునపడింది. సాధారణ రోజుల్లో ఇంటర్‌వెల్, లంచ్ బ్రేకులతో పాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్ బెల్ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30కు, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలో 545 ప్రభుత్వ పాఠశాలల్లో 28వేల మంది విద్యార్థులు చదువుతుండగా, 172 ప్రైవేట్ పాఠశాలల్లో 42వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో చాలా పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే అనేక పాఠశాలల్లో ఇవి పనిచేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
నీరు ఎంత తాగాలి


