అగ్రగామిగా రామగుండం
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ప్రజల సహకారంతో పనులన్నీ పూర్తిచేస్తానని భరోసా ఇచ్చారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే అభివృద్ధితోపాటు పర్యాటకం, వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లోనూ నంబర్‌వన్‌గా నిలపడమే తన లక్ష్యమన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..
రామగుండం అభివృద్ధి ఎలా?
ఎమ్మెల్యే: ఇప్పటికే రూ.516కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, ఎస్టీపీపీలు, తాగునీటి సరఫరా తదితర పనులు పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. వాటిని కూడా పూర్తిచేస్తాం.
ఆ వ్యాపార అవకాశాలు ఏమిటి?
ఎమ్మెల్యే: రోడ్డు, ఎయిర్‌పోర్టు, రైల్వే కనెక్టివిటీ ద్వారా చాలావ్యాపారాలు విస్తరిస్తాయి. ఇప్పటికే రూ.2కోట్లతో రెండు షాపింగ్ మాల్స్‌కు టెండర్లు పూర్తయ్యాయి. మరో రెండింటికి ప్రతిపాదించాం. తద్వారా వ్యాపారాలు వేగంగా వృద్ధి చెంది యువతకు ఉపాధి మెరుగవుతుంది.
వైద్యరంగం అభివృద్ధిపై ప్రణాళిక ఏమిటి?
ఎమ్మెల్యే: వైద్య విద్య ఇప్పటికే చాలాఅభివృద్ధి చెందింది. నగరంలో వైద్య సేవలు మరింత విస్తరిస్తాం. సింగరేణి ఆధ్వర్యంలో నెలరోజుల్లోనే కార్డియాలజీ సెంటర్ ప్రారంభించి గుండెపోటు మరణాలు తగ్గిస్తాం. రూ.36కోట్లతో నర్సింగ్ భవనం, రూ.140 కోట్లతో సిమ్స్, రూ.50కోట్లతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం.
యువతకు ఉపాధి ఇచ్చే హామీ ఏమిటి?
ఎమ్మెల్యే: నేను ఎమ్మెల్యేగా గెలిచాక ప్రైవేట్ ఓబీ పనుల్లో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించా. భవిష్యత్‌లోనూ ఇలాగే ముందుకు సాగుతా. యువతకు ఉపాధి లభించేలా వ్యాపారాలు విస్తరింపజేస్తాం.
నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్‌లో ఏం చేస్తారు?
ఎమ్మెల్యే: సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించు కున్న 11 వేల మందికి పట్టాలిస్తాం. ఇప్పటికే 3,500 మందికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మరో దశలో 3,500 పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తాం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఈప్రక్రియ ప్రారంభమవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ విధానంలో ఇళ్లు నిర్మిస్తాం.
పర్యాటకం పరిస్థితి ఏమిటి?
ఎమ్మెల్యే: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేశాం. రెండు హరిత హోటళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించాం. ఒకటి సాయిలీల హోటల్ ఎదుట, మరోటి గోదావరి వంతెన సమీప సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద నిర్మిస్తాం. గోదావరి నదిలో కాళేశ్వరం బ్యాక్‌వాటర్ వస్తే ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాం. ఎల్లంపల్లి, బుగ్గ సమీపంలోనూ పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గోదావరిఖని, ఎల్లంపల్లిలో వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తీసుకొస్తాం.
మహిళా సంఘాల పాత్ర ఎలా ఉంటుంది?
ఎమ్మెల్యే: మహిళా సంఘాలకు ఇప్పటికే రెండు అద్దె బస్సులు ఇచ్చాం. రూ.4కోట్లతో ఫంక్షన్, కమ్యూనిటీహాళ్లు నిర్మించి నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగిస్తాం. రూ.లక్ష కోట్ల రుణాలిచ్చి అర్థికంగా బలోపేతం చేస్తాం.
అగ్రగామిగా రామగుండం


