తీరని దాహం | - | Sakshi
Sakshi News home page

తీరని దాహం

Jan 6 2026 2:01 PM | Updated on Jan 6 2026 2:01 PM

తీరని

తీరని దాహం

గడువు ముగిసినా పూర్తికాని పనులు అందుబాటులోకి రాని ర్యాపిడ్‌ గ్రావిటీ ప్లాంట్‌ మళ్లీ గడువు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం కాంట్రాక్టర్‌ అభ్యర్థన మేరకు గడువు పొడిగింపు వేసవి వరకై నా స్వచ్ఛమైన నీరు అందించాలని కార్మికుల వినతి

గోదావరిఖని: ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌.. నీటిశుద్ధి కోసం సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న ప్లాంట్‌.. సింగరేణిలోనే తొలిసారి రామగుండం రీజియన్‌లో నిర్మిస్తోంది. తలాపునే గోదావరినది ఉన్నా సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభించడంలేదు. కలుషితనీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నాయి. దీనికి చెక్‌పెట్టేందుకు యా జమాన్యం రూ.25కోట్లతో ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ నిర్మిస్తోంది. 2024 మార్చిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పనులు ప్రారంభించారు. గతేడాది ఆగస్టులోనే పనులు పూర్తకావాల్సి ఉంది. గడువు ముగి సినా పనులు 80 శాతానికే పరిమితమయ్యాయి. సాంకేతిక పనులు పూర్తికావాల్సి ఉంది.

కాంట్రాక్టర్‌ విన్నపం మేరకు..

సింగరేణి ఆర్జీ–1, 2, 3, ఏఎల్‌పీ ఏరియాల్లో నివాసం ఉండే కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు యాజమాన్యం ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌ నిర్మిస్తోంది. గతేడాది ఆగస్టు వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. పనుల్లో జా ప్యం కావడంతో కాంట్రాక్టర్‌ మరోమూడు నెలల గడువు కోరారు. నవంబర్‌ చివరినాటికి ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేసి యాజమాన్యానికి అప్పగించాల్సి ఉంది. అయినా పనులు ఇంకా పూర్తికాలేదు.

అయినా పూర్తికాలేదు..

ర్యాపిడ్‌ గ్రావిటీ ప్లాంట్‌ క్లారిఫ్లాస్కులేటర్‌, ఫిల్టర్‌హౌస్‌, కెమికల్‌ హౌస్‌, క్లోరినేషన్‌ హౌస్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. నిర్దేశిత గడువు(గతేడాది నవంబర్‌)లోగా పనులు పూర్తికాలేదు. దీంతో మరింత గడువు కావాలని కాంట్రాక్టర్‌ సింగరేణికి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన విన్నపం మేరకు గడువు మరింత పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

అదనపు నిధులు కేటాయింపు

ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌లోని మిగిలిన పనులు చేపట్టేందుకు ఇటీవల జరిగిన సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో మరో రూ.7కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టెక్నికల్‌కు సంబంధించిన గ్రీన్‌వాటర్‌ చాంబర్‌, పైపులైన్‌ డైవర్షన్‌, ప్లాంట్‌ చుట్టూ కాంపౌండ్‌వాల్‌ పనుల కోసం వీటిని వెచ్చిస్తారు. నిర్వహణ కోసం మరో రూ.3 కోట్లు కేటాయించనున్నారు.

రోజూ 35 ఎంఎల్‌డీ నీటి సరఫరా..

సింగరేణి కార్మిక కుటుంబాలకు గోదావరినది నుంచి రోజూ పంపింగ్‌ ద్వారా 35 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటిని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలోని కార్మిక కుటుంబాలకు యాజమాన్యం పైపులైన్ల ద్వారా అందిస్తోంది. గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ల ద్వారా ఫిల్టర్‌బెడ్‌ నుంచి భారీ మోటార్లతో కార్మిక వాడలకు నిత్యం తాగునీటిని అందిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు నీటి సరఫరా బాగానే సాగినా.. కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటుతో తిప్పలు మొదలయ్యాయి. ప్రాజెక్టుతో నీటి నిల్వలు పేరుకుపోయాయి. నగరంలోని డ్రైనేజీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ రసాయనాలు నేరుగా గోదావరి నదిలో కలుస్తుండటంతో తాగునీరు కలుషితమవుతోంది. ఈనీటిని తాగిన కార్మిక కుటుంబాలు వ్యాధుల బారిన పడుతున్నాయి, వర్షాకాలంలో గోదావరినదికి వరద రావడంతో నెలరోజుల పాటు కార్మిక కుటుంబాలకు ఇదే దిక్కవుతోంది.

రూ.25 కోట్లు కేటాయింపు..

కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కార్మిక సంఘాలు, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ సింగరేణిపై ఒత్తిడి పెంచారు. యాజమాన్యం నిధులు మంజూరు చేసింది. ఆర్జీ–1 ఏరి యా జీడీకే–1, 3 గని ఫ్యాన్‌హౌస్‌ సమీపంలో 35 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ర్యాపిడ్‌ గ్రావిటీ ఫిల్టర్‌ ప్లాంట్‌కు పనులు ప్రారంభించారు.

తీరని దాహం 1
1/1

తీరని దాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement