పొలంలో దిగి.. వరినాటు వేసి
బొగ్గు బావిలో దిగి.. ఉత్పత్తిపై ఆరా తీసి.. రైతులు, సింగరేణి కార్మికులతో మమేకమై.. కష్ట, సుఖాలు అడిగి తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ
కాల్వశ్రీరాంపూర్/ఓదెల/రామగిరి/గోదావరిఖని:
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారంలోని పొలంలో దిగి వరినాట్లు వేశారు. గోదావరిఖనిలోని జీడీకే–11 గనిలోకి దిగి కార్మికుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. రామగిరి మండల కేంద్రంలో రిటైర్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఓదెల రైల్వేస్టేషన్‌లో పర్యటించి ఆర్వోబీల ఏర్పాటు ప్రతిపాదిత స్థలాలు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వంశీకృష్ణ మా ట్లాడుతూ, వీడియోలు, సినిమాలు, దూరదర్శన్ ప్రసారాల్లోనే వ్యవసాయ పనులు చూశానని, ప్రస్తుతం పొలంలో ప్రత్యక్షంగా చూడడం, రైతులు, వ్యవసాయ కూలీలు పడుతున్న శ్రమ తెలుసుకున్నానన్నారు. మహిళా కూలీలతో కలిసి భోజనం చేశారు. మామిడికాయ పచ్చడి, కారం బాగుందని ప్రశంసించారు. పంట పెట్టబడి, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పడే తిప్పలు, బొగ్గు గని కార్మికుల శ్రమ, రిటైర్డ్ కార్మికుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఎంపీ అన్నారు. ఓదెల, కొలనూర్‌తోపాటు రామగుండం సమీపంలోని పెద్దంపేట ఎల్‌సీ– 46, ఎల్‌సీ– 52, చీకురాయి ఎల్‌సీ–38, అందుగులపల్లి 44 వద్ద ఆర్వోబీల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, నాయకులు ప్రసాద్, సుశాంత్, లలిత్‌కుమార్, శ్రీనివాస్, వీరారెడ్డి, పి.మల్లికార్జున్, రఘునాథ్, నూనే రాజేశం, చిలకల జవహర్, పట్నం సత్యనారాయణ, బోనాల మల్లయ్య, తోట శంకరయ్య, కుడిది బక్కయ్య, రేండ్ల బాలరాజు, నస్పూరి రాయమల్లు, పులి రాజేశం, పల్లె కనుకయ్య, కాంగ్రెస్ నాయకులు సజ్జత్, అల్లం సతీశ్, శ్రీధర్‌పటేల్ పాల్గొన్నారు.
పొలంలో దిగి.. వరినాటు వేసి


