అధికారుల పొరపాట్లు.. అభ్యర్థులకు శిక్షలా?
హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు
మాట్లాడుతున్న కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): ‘ముసాయిదా ఓటరు జాబితా తయారీలో అధికారులు తప్పిదాలు చేస్తే అభ్యర్థులు, ఓటర్లు గుర్తించాలా? ఈ శిక్ష వారికెందుకు? చాలా డివిజన్లలో వందలాది ఓట్లు, ఇతర డివిజన్లల్లో కలిపారు ఎందుకు?’ అని రామగుండం నగరపాలక సంస్థ అధికారులపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. బల్దియా కమిషనర్ అరుణశ్రీ తన కార్యాలయంలో సో మవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 60 డివిజన్లలో పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాపై చర్చించారు. జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరణించిన వారి పేర్లు తొలగించలేదన్నారు. ఒక ప్రాంతంలోని ఓటర్లను దూరంగా ఉండే డివిజన్‌లో ఎలా కలిపారని ప్రశ్నించారు. దీనిద్వారా ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తిచూపరని తెలిపారు. ఒకరి ఫొటోపై మరొకరిది ఉందన్నారు. దీర్ఘకాలంగా ఒకేచిరునామాలో ఉంటున్న తమ ఓటును పక్క డివిజన్‌లోకి మార్చారని డిప్యూటీ మాజీ మేయర్ సాగంటి శంకర్, పలువురు మాజీ కార్పొరేటర్లు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా కమిషనర్ అరుణశ్రీకి అందజేశారు.
9 వరకు అభ్యంతరాల స్వీకరణ – అరుణశ్రీ, కమిషనర్
ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఈనెల 9 వరకు స్వీకరించి పరిష్కరిస్తామని, 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 2025 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి ఓటరుగా నమోదు అయిన వారిని ఎపిక్ ఐడీలో పేర్కొన్న చిరునామా ఆధారంగానే ఆయా డివిజన్ ఓటరు జాబితాలో చేర్చామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 800 ఓట్లు ప్రాతిపదికగా, ఇంటి నుంచి 2 కిలో మీటర్ల దూరంలోపు ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మరణించిన ఓటర్లు, రెండుచోట్ల నమోదైన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లన ఓటర్ల వివరాలు తమకు అందజేస్తే సవరించేలా చూస్తామని తెలిపారు. అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్‌వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అధికారుల పొరపాట్లు.. అభ్యర్థులకు శిక్షలా?


