అమలులోకి లేబర్ కోడ్స్
రామగుండం: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త లేబర్స్ కోడ్స్ గత నవంబరు 21వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. పాత కార్మిక చట్టాలను ఏకీకృతం, సరళీకృతం చేస్తూ.. కార్మిక సంక్షేమం, భద్రత, వేతనాలు, సామాజిక భద్రత మెరుగుపరచడం లక్ష్యంగా నాలుగు లేబర్ కోడ్స్ రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వీటిని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులోని ప్రధానాంశాలను పరిశీలిస్తే.. వేజెస్ కోడ్(వేతన కోడ్ చట్టం–2019) : అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధమైన హక్కు. ప్రతీనెల 7వ తేదీలోగా చెల్లించాలి. ఓవర్ టైమ్‌కు రెండింతల వేతనం చెల్లించాలి. అలవెన్స్‌లు 50శాతం మించకూడదు. సామాజిక భద్రత((చట్టం–2020) ప్రకారం.. గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లకు తొలిసారి సామాజిక భద్రత (పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ), ఫిక్స్‌డ్–టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటటీ చెల్లింపు, ప్లాట్‌ఫాం కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో గరిష్టంగా 2శాతం సామాజిక భద్రత నిధికి జమచేయాలి. పారిశ్రామిక సంబంధాలు(కోడ్ నెం.2020) ప్రకారం.. కనీసం 300 మంది కార్మికులు పనిచేసే సంస్థకు కార్మికుల తాత్కాలిక తొలగింపు, శాశ్వత తొలగింపు, కంపెనీ మూసివేతకు అనుమతి తప్పనిసరి చేశారు. సమ్మెలకూ ముందస్తు నోటీసు తప్పనిసరి చేశారు. వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని స్థితిగతులు ఇలా.. మహిళలు రాత్రి షిఫ్టులు, అండర్‌గ్రౌండ్ మైనింగ్ తదితర స్థలాల్లో సేఫ్టీ జాగ్రత్తలతో విధులు నిర్వర్తించవచ్చు. పనిగంటలు, ఓవర్‌టైం నియమాలు వర్తిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోం అనుమతి, వలస కార్మికులకు మెరుగైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తోంది.
హక్కులు హరించేవే
పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్‌ను అమలు చేయడం సరికాదు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వీటిని రూపొందించారు. ఇవి కార్మిక హక్కులను హరించేవే.
– అడారి నర్సింగరావు,
కార్యదర్శి, సీపీఎం, అంతర్గాం


