
గౌరవంగా బతికేలా..
రామగుండం నగరంలో ‘స్మైల్’ అమలుకు చర్యలు యాచకులను గుర్తించేందుకు అధికారుల సర్వే పునరావాస కల్పన.. సంక్షేమమే ధ్యేయం ట్రాన్స్‌జెండర్లపైనా బల్దియా ప్రత్యేక దృష్టి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
కోల్‌సిటీ(రామగుండం): యాచకులు లేనినగరంగా మార్చడానికి రామగుండం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మైల్ పథకాన్ని అమలు చేయడానికి బల్దియాలో యాచకుల వివరాల సేకరణ కోసం సర్వే నిర్వహిస్తున్నారు. యాచక వృత్తి నిర్మూలించి, దానిపై ఆధారపడి బతుకుతున్న వారికి పునరావా సం కల్పించి.. వారి జీవితాల్లోనూ ‘స్మైల్’ నింపేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని భావిస్తోంది.
పునరావాసం.. సంక్షేమం..
‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ర్‌పైజ్’(స్మెల్) పేరిట కేంద్ర ప్రభుత్వం రెండు రకాల పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో ఒకటి.. ట్రాన్స్‌జెండర్ల పునరా టవాసం, సమగ్ర సంక్షేమం, రెండోది.. యాచకుల సమగ్ర పునరావాసం కల్పన ఉన్నాయి. యాచక వృత్తిని అవలంబిస్తున్న వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక, స్వచ్ఛంద, సామాజిక సంస్థల సహకారంతో సమాజంలో గౌరవం పొందేలా చర్యలు తీసుకోవడానికి స్మైల్‌కు శ్రీకారం చుడుతున్నారు.
నిధులు కేటాయించిన కేంద్రప్రభుత్వం..
స్మైల్ పథకాన్ని అమలు చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద యాచకుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం నిధులు కేటా యించింది. దీనిద్వారా వారి జీవనోపాధి, పునరావాస కల్పన, విద్య, ఆరోగ్యం, శిక్షణ గురించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన పలు మున్సిపల్ కార్పొరేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేశాయి. ఇందులో మనజిల్లాలోని నగరం రామగుండం బల్దియాను కూడా ఎంపిక చేశారు. స్మైల్ పథకం అమలుకు ఇటీవల రామగుండానికి రూ.9లక్షలు కేటాయించారు.
యాచకుల వివరాల సేకరణ..
స్మైల్‌లో భాగంగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు.. రామగుండంలో ప్రతీయాచకుడి పూర్తి వివరాలను మెప్మా ఆధ్వర్యంలో సేకరించే ప్రక్రియ చేపట్టారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్, రామగుండంలోని రైల్వేస్టేషన్, నగరంలోని ఇతర ప్రధాన కూడళ్లు, దేవాలయాల ప్రాంతాల్లో ఉండే యాచకులను గుర్తించడానికి అధికారులు శరవేగంగా సర్వే కొనసాగిస్తున్నారు. సర్వేలో పొందుపర్చిన వివరాలను మెప్మా సిబ్బంది నమోదు చేసుకుంటున్నారు.
ఎన్జీవోకు నిర్వహణ బాధ్యతలు..
నైట్‌షెల్టర్ల నిర్వహణ తరహాలోనే స్మైల్‌ను కూడా నిర్వహించడానికి ఎన్జీవోలకు బాధ్యతలు అప్పగించడానికి రామగుండం బల్దియా కమిషనర్ ఇటీవల నోఫికేషన్ విడుదల చేసిందని తెలిసింది. స్మైల్ నిర్వహణకు ఆసక్తి చూపిన రెండు ఎన్జీవోల నుంచి ఇప్పటికే బల్దియాకు అందిన దరఖాస్తుల్లో ఒక ఎన్జీవోనే ఎంపిక చేయడానికి బల్దియా అధికారులు జాబితా ను కలెక్టర్ పరిశీలనకు పంపించారు.

గౌరవంగా బతికేలా..