
సరిపడా యూరియా ఉంది
సమస్యలుంటే 99899 94617 నంబరుకు కాల్‌చేయండి
● త్వరలోనే మరికొంత వస్తుంది● మోతాదుకు మించి వినియోగించొద్దు● ఇళ్లలో నిల్వచేస్తే ఆవిరవుతుంది ● ‘సాక్షి’తో జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాస్
పెద్దపల్లిరూరల్: వానాకాలం పంటల దిగుబడి పెంచుకునేందుకు ఎరువులు, పురుగు మందులను అవసరమైన మోతాదులోనే వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాస్ రైతులకు సూచించారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అయితే, అవసరానికి మించి తీసుకెళ్లడంతోనే కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మోతాదుకు మించి యూరియా చల్లితే వరి రంగుమారుతుందని తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని సూచించారు. విదేశాల నుంచి యూరియా దిగుమతి అయ్యే అవకాశాలు మెరుగుపడడంతో రెండురోజుల్లోగా మరిన్ని నిల్వలు జిల్లాకు చేరే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
మోతాదుకు మించి యూరియా చల్లితే ఏమవుతుంది?
డీఏవో : వరి పంటలో ఎకరానికి రెండు బస్తాలు నాలుగు దఫాలు, పత్తికి మూడు బస్తాలను చల్లాలి. ఆఖరి దఫాలో పొటాష్‌ను కలిపి చల్లాల్సి ఉంటుంది. ఎక్కువ చల్లితే ఆకురంగు మారి, పూత, కాత తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
జిల్లాలో వానాకాలం సాగు విస్తీర్ణం ఎంత?
డీఏవో : అన్నిరకాల పంటలు కలిపి 2,65,990 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయని అంచనా వేశాం. ఇప్పటివరకు 2,44,687 ఎకరాల విస్తీర్ణంలో సాగైంది. ఇందులో అత్యధికంగా వరి 1,92,260 ఎకరాల్లో సాగు కాగా, పత్తి 51,595 ఎకరాల్లో సాగు చేశారు.
కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధర వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి?
డీఏవో : యూరియా విక్రయాలు ఈ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నాం. ఎరువులు, విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉన్నాయి. అయినా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.
యూరియా ఏమేరకు అవసరమని అంచనా వేశారు?
డీఏవో : వానాకాలం సాగుకు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశాం. కానీ 21,581మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. అందులో 18,991 మెట్రిక్ టన్నులను రైతులకు విక్రయించారు.
ఒక్కొక్కరికి ఎన్ని యూరియా బస్తాలిస్తున్నారు?
డీఏవో : ఎకరాకి రెండు బస్తాలు అవసరం. ప్రస్తుత నిల్వను బట్టి ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకం ఆధారంగా ఈపాస్‌మిషన్‌లో రైతు వివరాలు నమోదు చేసి ఎకరాకి ఒక బస్తా ఇస్తున్నాం. మళ్లీ 20 రోజుల తర్వాత ఇంకొక బస్తా అందిస్తాం.
యూరియా లేదని రైతులు ఆందోళన పడుతున్నారు?
డీఏవో : జిల్లాలో ప్రస్తుతం 2,590 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. ఇది నాలుగైదు రోజుల వరకు సరిపోతుంది. ఈలోగా మరికొంత జిల్లాకు చేరేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం.
సమస్యలు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి?
డీఏవో : యూరియా సంబంధిత సమస్యలు ఎదురైతే జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలోని 99899 94617 ఫోన్ నంబరులో సంప్రదించాలి.
చిన్నరైతులకు యూరియా అందడడం లేదంటున్నారు?
డీఏవో : రైతులు తమ అవసరాలకు మించి తీసుకెళ్లి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇలా చేస్తే యూరియా ఆవిరై పోతుంది. వాస్తవంగా అవసరమయ్యే చిన్నరైతులకు యూరియా లభించకనే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇంట్లో యూరియా నిల్వ ఉంటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

సరిపడా యూరియా ఉంది