
కాసులు కురిపిస్తున్న బొగ్గు
ఓవర్ బర్డెన్ గుట్టల నుంచి సేకరణ ఇటుక బట్టీలు.. హోటల్‌ళ్లకు తరలింపు అర్ధరాత్రి అక్రమంగా రవాణా చేస్తున్న మాఫియా ప్రభావిత గ్రామాలే కేంద్రంగా జోరుగా వ్యాపారం
మంథనిరూరల్: సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఏ ఇంటి ముందు, వెనుక చూసినా బొగ్గు కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ దృశ్యం ఆ ఊళ్లలో సహజమే అయినా.. కొందరు దళారులు అక్రమ మార్గంలో తరలిస్తూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. తొలుత రాత్రి, తెల్లవారుజామున సమీపంలోని ఓవర్ బర్డెన్(ఓబీ – మట్టి) కుప్పల నుంచి బొగ్గు సేకరిస్తూ గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తున్నా.. కొందరికి కాసులు కురిపిస్తోంది. సింగరేణి ప్రభావిత గ్రామాలుగా గుర్తించడంతో అభివృద్ధి పనులు, ప్రభుత్వపరంగా అందే ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో గత్యంతరం లేక కొందరు బొగ్గు సేకరణను ఉపాధిగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా ఇది మంథని మండలంలోని సింగరేణి ప్రభావిత అక్కెపల్లి, సిద్ధపల్లి తదితర గ్రామాల్లో జోరుగా సాగుతోంది.
ఓబీ కుప్పల నుంచి సేకరణ..
సింగరేణి బొగ్గు గనుల సంస్థ తమ అవసరాలు, ఓసీపీల విస్తరణ కోసం అక్కెపల్లి, సిద్ధపల్లి గ్రామాలను స్వాధీనం చేసుకుంది. ఈక్రమంలో ఓసీపీలో బొగ్గు తీసేందుకు పైపొరలోని మట్టిని తవ్వితీస్తోంది. ఈ మట్టిన ప్రభావిత గ్రామాల సమీపంలోనే కుప్పలుగా పోస్తోంది. ఈ మట్టిలో కలిసిఉన్న బొగ్గును స్థానికులు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా బొగ్గు సేకరణతో వారు ఉపాధి పొందుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని సింగరేణి అధికారులు తరచూ హెచ్చరించినా కొందరిలో మార్పురావడం లేదు.
హోటళ్లు, ఇటుక బట్టీలకు విక్రయాలు..
ఓబీ కుప్పల నుంచి సేకరించిన బొగ్గును ఒకచోట నిల్వ చేశాక.. కొందరు బొగ్గు నిల్వలను ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌ల ద్వారా ఇటుక బట్టీలు, ఇతర ప్రాంతా ల్లోని హోటళ్లకు అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు సింగరేణి బొగ్గును పొయ్యిలలో వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది.
దళారుల ఎంట్రీతో..
ప్రభావిత గ్రామాల్లోని కొందరి ఉపాధిని ఆసరాగా చేసుకుంటున్న దళారులు బొగ్గును అక్రమ మార్గంలో తరలించేందుకు తెరలేపారు. తక్కువ ధరకు స్థా నికుల నుంచి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
బస్తాకు రూ.70 నుంచి రూ.100 ధర
సిమెంట్ బ్యాగ్‌లో నింపిన బొగ్గు ఒక బస్తా రూ.70 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది. ఒకవ్యక్తి రోజూ మూడు నుంచి ఐదు బస్తాల్లో బొగ్గు సేకరిస్తూ నిల్వచేస్తున్నాడు. ఇలా సేకరించిన బొగ్గు ను సింగరేణి ఏరియాల్లో స్థానికులు వంటలు త యారు చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో కొందరు సమీపంలోని సింగరేణి ప్రాంతాల్లో రహస్యంగా బొగ్గు అమ్ముకుంటున్నారు.
పట్టుకుంటున్నాం
సింగరేణి ప్రభావిత గ్రామాల్లో తరచూ దా డు లు చేస్తూ అక్రమంగా నిల్వ చేసిన బొగ్గు పట్టు కుని కేసులు నమోదు చేస్తున్నాం. అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అలాగే యాంటీ కోల్ తెఫ్ట్ టీం సైతం దాడులు చేస్తోంది. బొగ్గు అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకుంటోంది.
– షబ్బీర్, సెక్యూరిటీ ఆఫీసర్,
ఆర్జీ– 3 ఏరియా

కాసులు కురిపిస్తున్న బొగ్గు

కాసులు కురిపిస్తున్న బొగ్గు