
స్థానిక పోరుకు సిద్ధం
● ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం ● గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్‌లు ● ఈసారి స్వల్పంగా తగ్గిన పంచాయతీలు ● ఇంకా స్పష్టతరాని రిజర్వేషన్ల ప్రక్రియ
పెద్దపల్లిరూరల్: ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సర్కార్ ఎప్పు డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా తాము సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి సుమారు ఏడాదిన్నరకుపైగా అవుతోంది. అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది.
బ్యాలెట్ పేపర్.. బాక్స్‌లు సిద్ధం
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు గతంలోనే ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పత్రాలు, బాక్స్‌లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగులను ఎంపిక చేసి ఓ ధఫా శిక్షణ కూడా పూర్తిచేశారు. ఎన్నికల సామగ్రి ఇప్పటికే జిల్లాకు వచ్చి చేరింది. ఆ సామగ్రిని మండలాలకు తరలించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
తగ్గిన వార్డులు.. పెరిగిన ఓటర్లు
జిల్లాలోని 13 మండలాల్లో (రామగుండం మినహా) గత ఎన్నికల కన్నా 4 పంచాయతీలు, 35 వార్డులు తగ్గాయి. దాదాపు 50 వేల మంది వరకు ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 3,57,556 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా ఓటర్లుగా జాబితాలో నమోదై నట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ కాశం కూడా ఉంది. గతంలో 267 పంచాయతీలు, 2,467 వార్డులు ఉండగా.. ఈసారి 263 పంచాయతీలు, 2,432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
రిజర్వేషన్ల సంగతేమిటో..?
ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించినా అందుకు కేంద్రప్రభుత్వం బిల్లును ఆమోదించలేదు. దీంతో రిజర్వేషన్లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఏర్పాట్లు ముమ్మరం..
ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎప్పుడొచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉండేలా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సిబ్బంది జాబితా సిద్ధం చేశారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితానూ సిద్ధం చేస్తున్నారు.
సిద్ధంగా ఉన్నాం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేసే పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఓటరు మ్యాపింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వం, ఉన్నఽతాధికారులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. బ్యాలెట్ బాక్స్‌లు గుజరాత్ నుంచి తెప్పించి సిద్ధంగా ఉంచాం.
– వీరబుచ్చయ్య, డీపీవో

స్థానిక పోరుకు సిద్ధం