
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ల రద్దీ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, మాతా శిశు ఆస్పత్రుల్లో సోమవారం పేషెంట్ల రద్దీ పెరిగింది. జ్వరం, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధుల బారినపడ్డ వేలాదిమంది ఆస్పత్రుల బాటపట్టారు. ఓపీ వద్ద, బ్లడ్‌శాంపిల్ సేకరణ కోసం వివరాలను నమోదు చేయించేందుకు నిరీక్షించారు. వైద్యులు పరీక్షించి రాసిన మందులను తీసుకునేందుకు ఫార్మసీ కౌంటర్ వద్ద కూడా బారులుతీరారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వచ్చి న గర్భిణులు టిఫా స్కానింగ్ కోసం పెద్దసంఖ్యలో క్యూలైన్‌లో వేచిఉండడం కనిపించింది.
జీజీహెచ్‌లోనూ..
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) కూడా రద్దీగా మారింది. దగ్గు, జలుబు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కీళ్లనొప్పులు, జ్వరం తదితర సమస్యలతో పేషెంట్లు ఆస్పత్రికి భారీగా తరలివచ్చారు. వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 1,270 మంది ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ల రద్దీ