బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..? | - | Sakshi
Sakshi News home page

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..?

Aug 11 2025 6:24 AM | Updated on Aug 11 2025 6:26 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడిచే ప్రధానమార్గాలతో పాటు గ్రామాలకు వెళ్లే రూట్లలోనూ బస్‌షెల్టర్లు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు రోడ్డుపై నిరీక్షించలేక ప్రైవేట్‌వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదన్న విమర్శలున్నాయి.

బస్‌షెల్టర్‌ లేని బాధలు

పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణానికి ఆర్టీసీ బ స్సులే ఆధారం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ, ప్రయాణికులు బస్సులకోసం నిరీక్షించేందుకు అవసరమైన షెల్టర్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడవాల్సిన పరిస్థితులున్నాయని వాపోతున్నారు.

పలుచోట్ల నిరుపయోగంగా..

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల నిమిత్తం వచ్చిపోతుంటారు. వారి సౌకర్యం కోసం కలెక్టరేట్‌ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని కలెక్టరేట్‌ అధికారులు పలు మార్లు ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రయాణికుల కోసం బస్‌షెల్టర్‌ కూడా నిర్మించారు. అయినా ఇక్క డ ఆర్డీనరీ బస్సులు తప్ప ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ బస్సులు నిలపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల వంతెన వద్ద కూడా బస్‌షెల్టర్‌ నిరుపయోగంగానే ఉంటోంది. ఇలా రాజీవ్‌రోడ్డు వెంట బస్సులు ఆగే ప్రాంతాల్లో కాకుండా దూరంగా నిర్మించిన షెల్టర్‌లను బస్సులు ఆగే చోట నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

ఏటా పెరుగుతున్న ప్రయాణికులు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అయినా సంబంధిత అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో లయన్స్‌, రోటరీక్లబ్‌, కేశోరాం, ఎన్టీపీసీ లాంటి సంస్థలు బస్‌షెల్టర్ల నిర్మాణాలకు ముందుకొచ్చేవి. కానీ, ఈ మధ్య అలాంటి కార్యక్రమాలను ఎవరూ చేపట్టకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణంగా చెప్పుకోవచ్చు.

బస్సుల కోసం ప్రయాణికుల పాట్లు

ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే

రోడ్లపై.. దుకాణాల ఎదుట నిరీక్షణ

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

‘ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని కమాన్‌ ఏరియా సమీపంలోనిది. ఇక్కడి నుంచి గోదావరిఖని, మంచిర్యాల, మంథని తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు రోడ్డుపై ఎండలో, వానలో నిలబడాల్సిందే. సమీపంలో ఉన్న దుకా ణాల ముందు నిలబడితే వారితో చీవా ట్లు తినాల్సి వస్తోందని వాపోతున్నారు.’

‘ఇది పెద్దపల్లిలోని కమాన్‌ ప్రాంతంలో గల (కరీంనగర్‌వైపు) బస్టాప్‌.

కరీంనగర్‌ వెళ్లే బస్సుల్లో ఎక్కేందుకు రోడ్డుపైనే నిరీక్షించే ప్రయాణికులకు ప్రైవేట్‌ వాహనదారులు నరకం చూపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు వచ్చే సమయం దాకా వాటికి అడ్డుగా ప్రైవేట్‌ వాహనాలను నిలపడంతో అవి ఆగకుండా పోతున్నాయని ప్రయాణికుల ఆవేదన.’

‘ఇది పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద హెచ్‌కేఆర్‌ వారు వేసిన బస్‌షెల్టర్‌. ఇరవైఏళ్లుగా ఈ షెల్టర్‌లో కనీసం ఒక్కప్రయాణికుడు కూడా కూర్చోలేదు. ఎందుకంటే ఇక్కడ బస్సులే ఆగవు. దీనికి సమీపంలోనే కలెక్టరేట్‌ వద్ద షెల్టర్‌ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ షెల్టర్‌ను అక్కడికి మార్చాలని కోరుతున్నారు.’

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ఆర్టీసీ బస్సులు ఆగే స్థలాల వద్ద బస్‌షెల్టర్లు అవసరమనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కమాన్‌ ప్రాంతంలో ప్రైవేట్‌ వాహనాలను నియంత్రించేందుకు కొంతకాలం ఆర్టీసీ అధికారిని నియమించింది. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంగోపాల్‌రెడ్డి,

బస్‌స్టేషన్‌ మేనేజర్‌, పెద్దపల్లి

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..? 1
1/3

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..?

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..? 2
2/3

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..?

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..? 3
3/3

బ‘స్టాప్‌’ షెల్టర్లు ఏవి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement