
ఆపరేషన్ కగార్ నిలిపేయాలి
ఓదెల:కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఓదెల మండలం కనగర్తిలో జరిగిన సీపీఐ మండల మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలన్నారు. ఇటీవల ఆపరేషన్ కగార్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనాయకుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పోటీ చేసి విజేతలుగా నిలవాలన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్, తాళ్లపల్లి లక్ష్మణ్, స్వామి, జిల్లా నాయకులు తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు
బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో చట్టం చేయాలి
గోదావరిఖని: 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి ఆమోదం కోసం పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ మతం రంగు పులుముతోందని తెలిపారు. నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజాపోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, శైలజ, ఎన్.బిక్షపతి, నేర్వట్ల నర్సయ్య, తుమ్మల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో
భక్తుల పూజలు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో భక్తులు ఆదివారం పూజలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కోనేరులో స్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి, సీతారామచంద్రస్వామి, ఖండేలరాయుడు, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలతో పాటు బోనాలు సమర్పించుకున్నారు.
అక్టోబర్ 3న దసరా సెలవుగా ప్రకటించాలి
గోదావరిఖని: అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండుగ ఒకేరోజు వచ్చినందున అక్టోబర్ 3న దసరా పండుగ జరుపుకునేందుకు సెలవు దినంగా సింగరేణి యాజమాన్యం ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. ఆదివారం గోదావరిఖనిలోని శ్రామికభవన్‌లో మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయంలో ఆడబిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లతో ఇంటిల్లిపాది జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చినందున ఆనందదాయంగా జరుపుకోవడం వీలుకాదని తెలిపారు. కార్మిక కుటుంబాలకు అక్టోబర్ 2న కాకుండా 3న దసరా సెలవు ప్రకటించాలని కోరారు.
పోచమ్మకు బోనం
గోదావరిఖనిటౌన్: శివాజీనగర్ కూరగాయల మార్కెట్‌లోని పోచమ్మ ఆలయంలో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రజలుసుభిక్షంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ఆపరేషన్ కగార్ నిలిపేయాలి

ఆపరేషన్ కగార్ నిలిపేయాలి