
యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా
● నిబంధనలకు విరుద్ధంగా షాపుల్లోనే రీఫిల్లింగ్ ● తెలిసినా పట్టించుకోని అధికారులు
గోదావరిఖని: గోదావరిఖని పట్టణంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీనికి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత జనావాసాలకు దూరంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేయాల్సి ఉండగా.. అదేమి పట్టించుకోకుండా గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్ల రిపేర్ల పేరుతో రీఫిల్లింగ్ దందా కొనసాగిస్తున్నారు. అలాగే వంట గ్యాస్‌ను కార్లలో ఫిల్లింగ్ చేసేందుకు కూడా కొన్ని సెంటర్లు కొనసాగుతున్నాయి. గ్యాస్‌సిలిండర్‌ను తీసుకెళ్తే ఎలక్ట్రిక్, డీసీ మోటార్ ద్వారా పైపులు బిగించి కార్లలో గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా షాపుల్లో పెద్ద సిలిండర్ల నుంచి పైపుల ద్వారా మూడు, ఐదుకిలోల గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇదంతా బాహాటంగానే సాగుతున్నా అధికారులు ఏంచేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పలు సంఘటనలు జరుగుతున్నా..
గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం గోదావరిఖని లక్ష్మీనగర్ మేదర్‌బస్తీ వైపు వెళ్లే దారిలో ఓగ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. దీంతో సిలిండర్‌ను నడిరోడ్డుపై పడేశారు. మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి తడిచిన తట్టుబొంతలు వేసి మంటలు ఆర్పివేశారు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు లేస్తున్న సిలిండర్ పక్కనే ద్విచక్రవాహనం ఉంది. టూవీలర్‌కు మంటలు అంటుకుంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని అంటున్నారు. గతంలో ఇలా రీఫిల్లింగ్ చేస్తున్న క్రమంలో చాలా మంది గాయపడి సందర్భాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిబందనలకు విరుద్దంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రీఫిల్లింగ్ చేయడం చట్ట విరుద్ధం
పెద్దసిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేయడం చట్ట విరుద్దం. జనావాస ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం ప్రమాదకరం. రీఫిల్లింగ్ అనుమతి పొంది జనావాసాలకు కనీసం వంద మీటర్ల దూరంలో రీఫిల్లింగ్ సెంటర్ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరిగితే అత్యవసర పరిస్థితుల్లో 101నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.
– డి.అనిల్‌కుమార్,
జిల్లా అగ్నిమాపక అధికారి

యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా