
సింగరేణిపై కవిత నజర్
గోదావరిఖని: సింగరేణిలో పట్టుకోసం టీబీజీకేఎస్ గౌవాధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హెచ్‌ఎంఎస్‌తో కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక ప్రణాళికలున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలకు ముందే 11ఏరియాలకు ఇన్‌చార్జీలుగా జాగృతి నాయకులను ప్రకటించారు. సంఘం నాయకులను సంప్రదించకుండానే ఏరియా ఇన్‌చార్జీలను నియమించడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై యూనియన్ ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. త్వరలో శ్రీరాంపూర్‌ఏరియాలో భారీ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. హెచ్‌ఎంఎస్ నేత రియాజ్‌అహ్మద్‌తో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్‌ఎంఎస్, జాగృతి కలిసి సమష్టిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం సమావేశం అయ్యారు.
సింగరేణిలో పట్టుకోసం కవిత వ్యూహం
టీబీజీకేఎస్ ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించిన క్రమంలో కవిత సింగరేణిలో పట్టు కోసం కార్మికుల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్మిక సంఘమైన హెచ్‌ఎంఎస్‌తో కలిసి అన్ని ఏరియాల్లో పర్యటించి, కార్మికులకు దగ్గర కావాలని నిర్ణయించారు. దశాబ్ధకాలంగా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో హెచ్‌ఎంఎస్ యూనియన్‌తో కలిసి కార్మికుల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా ఉండి హెచ్‌ఎంఎస్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించడంతో టీబీజీకేఎస్ వైఖరి ఏవిధంగా ఉంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
వచ్చేనెలలో కార్మిక భరోసా యాత్ర
కార్మికుల సమస్యలపై సింగరేణివ్యాప్తంగా పర్యటించేందుకు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. హెచ్‌ఎంఎస్ నాయకులతో కలిసి కార్మికుల్లో భరోస నింపడానికి ప్రణాళికలు రూపొందించారు. గతనెలలో మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయం, ఇన్‌కంటాక్స్ రద్దు చేయాలని, అంతర్గత ఉద్యోగాలు భర్తీ చేయాలని, కార్మికుల సొంతింటి కల నిజం చేయడంతో పాటు పలు సమస్యల పరిష్కారం కోసం కార్మిక భరోసా యాత్రకు ప్రణాళికలు రూపొందించారు. ఈనెల రెండో వారంలో సంస్థ సీఅండ్‌ఎండీని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
హెచ్‌ఎంఎస్‌తో ముందుకెళ్లేందుకు నిర్ణయం
అన్ని ఏరియాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు
కోల్‌బెల్ట్‌లో మారుతున్న సమీకరణలు

సింగరేణిపై కవిత నజర్