
‘సర్కారు’ భూమి ‘హస్తగతం’
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది.
● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ