
మహిళా కార్మికులపై వేధింపులు
● వేతనాలు నిలిపివేసిన బల్దియా అధికారులు ● ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన కార్మికులు ● అధికారుల తీరుపై నేతల ఆగ్రహం
కోల్‌సిటీ(రామగుండం): బల్దియా నర్సరీ మహిళా కార్మికులను అధికారులు మానసికంగా వేధిస్తున్నారని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వై.యాకయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు ఆరోపించారు. బల్దియా ఆవరణలో శనివారం నర్సరీ మహిళా కార్మికులు తమ గోడును నాయకుల ఎదుట వెళ్లబోసుకున్నారు. ఈనెల వేతనాలు తమకు నిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాయకులు వై.యాకయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు మాట్లాడుతూ ఆర్నెల్లుగా కార్మికులను వేధిస్తున్నారన్నారు. ఓ అధికారి తమ ఇంటికి వచ్చి పిల్లలకు చదువు చెప్పాలని ఒత్తిడి చేశారని, చదువు చెప్పేంత చదువు తమకు రాదని, తాము రాలేమని సదరు అధికారికి కార్మికులు చెబితే వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళా కార్మికురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.