ముంచుకొస్తున్న ముప్పు
● జిల్లావ్యాప్తంగా వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం ● నీరు అందక ఎండిపోతున్న పంటలు ● పొదుపుగా వినియోగించాలంటున్న అధికార యంత్రాంగం
పొదుపుగా వాడాలి
సాక్షి, పెద్దపల్లి: వేసవి ఆరంభానికి ముందునుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు సెల్సియస్‌కు చేరుకుంటున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతేకాదు.. ఎండల తీవ్రతతో భూగర్భ జలమట్టం అత్యంత వేగంగా పడిపోతోంది. ఈ ఏడాది ప్రారంభం, ప్రస్తుత పరిస్థితులకు పోల్చితే సుమారు మీటరు నుంచి మీటరున్నర లోతుకు నీటిమట్టం పడిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయడంలేదు. మరోవైపు.. ఎస్సారెస్పీ కాలువ చివరి భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురిస్తోంది.
ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత..
సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు వేసవి ఉంటుంది. కానీ, మార్చి కన్నా ముందుగానే.. అంటే.. ఫిబ్రవరి చివరివారం నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సి వస్తోంది. రాత్రివేళల్లో ఉక్కపోత కూడా ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో భూమిలో నుంచి వేడి వెలువడి మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. భూగర్భ జలమట్టం పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లు వట్టిపోయాయి. పంట పొలాలు బీళ్లువారుతున్నాయి. బోర్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొట్టదశలోని పంటలను కాపాడుకోవడానికి రూ.లక్షల్లో అదనంగా ఖర్చుచేసి బోర్ల తవ్వకం చేపట్టినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది.
వ్యవసాయానికే అధికంగా వినియోగం..
జిల్లా వ్యాప్తంగా 2024లో భూగర్భ జలాలపై అంచ నా వేయగా.. 44,754 హెక్టా మీటర్ల పరిధిలో నీళ్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 17,608 హెక్టా మీటర్ల భూగర్భ జాలలను సాగుకు వినియోగిస్తుండగా.. పరిశ్రమలు, గృహావసారాలు, తాగునీటి అవసరాల కోసం మరో 2,702 హెక్టా మీటర్ల నీటిని ఉపయోగించుకుంటున్నారని తేల్చారు. మొత్తంగా 45.38 శాతంతో 20,310 హెక్టా మీటర్ల నీటిని జిల్లావ్యాప్తంగా ప్రజలు వినియోగిస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది అడుగంటిన వ్యవసాయ బావి. ధర్మారం మండలం కొత్తపల్లి
శివారులోనిది. వ్యవసాయ బావుల ఆధారంగా దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో వరి, తదితర పంటలు పండిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బావుల్లో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి. పూడిక తీసేందుకు క్రేన్లు, ఇతర యంత్రాలు వినియోగిస్తూ రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు బోరుబావులు వేస్తూ చివరి ప్రయత్నంగా పంటలు కాపాడుకోవడానికి
తాపత్రయపడుతున్నారు.
జిల్లాలో భూగర్భ జలమట్టం(మీటర్లలో)
ఏడాది 2024 2025
జనవరి 4.95 4.95
ఫిబ్రవరి 5.09 5.44
మార్చి 5.58 5.70
ప్రస్తుతం వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోకూ అత్యధికంగా నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. రైతులు నీటిని అవసరాల మేరకే వినియోగించుకోవాలి. వృథా చేయెద్దు, గృహ అవసరాలకు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. జిల్లావాసులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటేనే వేసవి గట్టెక్కుతుంది. – లావణ్య,
ఏడీ, భూగర్భ జలవనరుల శాఖ
ముంచుకొస్తున్న ముప్పు


