24 గంటల్లో చోరీ కేసు ఛేదన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పాతబజార్ ప్రాంతంలో బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణం తాళాలు పగులగొట్టి 100 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్‌కు చెందిన లోకిని తిరుమల భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత పెద్దపల్లిలోని ఓ హోటల్‌లో కొంతకాలం పనిచేసిన తిరుమల.. పనిమానేసి ఇంటివద్ద ఖాళీగానే ఉంటోంది. ఖర్చులు ఇతర అవసరాలకు డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచనతో దొంగతనాలు చేయాలని నిర్ణయించింది.
సుత్తితో తాళాలు పగులగొట్టి..
సోమవారం రాత్రి సుత్తి వెంటతెచ్చుకుని ఫస్ట్‌ఫ్లోర్‌లోని దేవరకొండ కరుణాకర్ నగల దుకాణం షట్టర్ల తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించింది. 100 గ్రాముల బంగారు ఆభరణాలు (చైన్లు, గుండ్లు, గొట్టాలు)తోపాటు రూ.40వేల నగదు చోరీ చేసింది. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజీల సాయంతో మహిళాదొంగగా నిర్ధారించారు. ఆ తర్వాత తిరుమలను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బహిర్గతమైంది. నగదులో రూ.12వేలను అవసరాలకు వినియోగించుకుంది. మిగతా రూ.28వేలతోపాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల సాయంతోనే నిందితురాలిని 24గంటల్లోగా పట్టుకున్నామని, వీటి ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుళ్లు ప్రభాకర్, అనిల్‌కుమార్, రాజు, రమేశ్‌ను అభినందించి ప్రోత్సాహకాలు అందించారు.
మహిళా దొంగను పట్టించిన సీసీ కెమెరాలు
ఆభరణాలు, నగదు రికవరీ చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్


