
ఆదాయం పెంచేలా ప్రణాళికలు ఉండాలి
పెద్దపల్లిరూరల్: ఆదాయాన్ని పెంచేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. దుబారా ఖర్చులు తగ్గించి పట్టణాభివృద్ధికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆదాయవనరులు పెరిగితేనే ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. పన్నులను నూరుశాతం వసూలు చేయాలని, వార్డుల వారీగా అధికారులు, సిబ్బందిని నియమించి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పన్నుల పెంపుపై అవసరమైనచోట రీ అసెస్‌మెంట్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష