గోదావరిఖని: భవిష్యత్ తరాలు గుర్తుండేలా పోలీసుల పనితీరుండాలని, క్రమశిక్షణ, నిబద్దతతో పనిచేసిన అధికారులు, సిబ్బందికి తగిన గుర్తింపు ఇస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసుల నుద్దేశించి మాట్లాడారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్తే విలువైన సమాచారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్క అధికారి తమ వ్యక్తిగత జీవితానికి, మీవద్ద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలని, సిబ్బందితో మర్యాదగా మాట్లాడి దర్బార్ లాంటివి నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే వారికి పెద్దలా ఉండి పరిష్కరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా చేయడం కన్నా, సమయానుసారంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఇది మీసంకల్పం, నిబద్ధత మీకు గౌరవాన్ని ఇస్తుందన్నారు.
సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం
ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో హోలీ వేడుకలు జరుపుకుందామని సీపీ అంబర్‌కిశోర్ ఝా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. హోలీ వేడుకల్లో ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. అనుమతి లేకుండా వ్యక్తులు, మహిళలు, యువతులు, వాహనాలపై రంగులు చల్లడం సరికాదన్నారు. బైకులు, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు. హోలీ సందర్భంగా పెట్రోలింగ్ పెంచామని, ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.