ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

Published Tue, Nov 14 2023 12:30 AM

నూతనంగా ఓటు హక్కు పొందిన యువత
 - Sakshi

● నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ● ‘సాక్షి’తో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత

కమాన్‌పూర్‌(మంథని): ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదిగో అదిగో ఖాళీలు భర్తీ చేస్తామంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. రాష్ట్ర రాజధానిలో కాకుండా నియోజకవర్గాల్లో పరిశ్రమలు విస్తరించడంలో పాలకులు విఫలమవుతున్నారు. పరిశ్రమలు అందుబాటులో లేక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా అధికారంలోకి వచ్చే పాలకులు చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం చూపించాల్సిన బాధ్యత పాలకులదేనని కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సంతోషంగా ఉంది

మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. మొదటిసారిగా ఓటు వేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు రిజర్వేషన్‌ లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసే వారికే ఓటేస్తా.

– శ్రీవీరా, యైటింక్లయిన్‌కాలనీ

అవకాశాలు కల్పించేవారికే ఓటు

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పార్టీకి ఓటేస్తా. ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

– మేరుగు గాయత్రి సిరి, జూలపల్లి

ప్రజాస్వామ్యంలో కీలకం

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు దోహదపడుతుందని భావిస్తున్నా. పార్టీల కంటే వ్యక్తిగతంగా ముఖ్యం. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలి.

– దూడం శ్రీనీజా, సుల్తానాబాద్‌

అవినీతికి పాల్పడని వారికే ఓటు

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైనది. ఓటును డబ్బులకు అమ్ముకోవద్దు. అవినీతికి పాల్పడనివారికి ఓటేస్తా. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.

– స్వాతికహృదయ్‌, లొంకకేసారం, రామగిరి మండలం

అందుబాటులోకి తీసుకురావాలి

ఇక్కడి యువత ఉద్యోగ అవకాశాల్లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఐటీ సంస్థలను అందుబాటులోకి తీసుకురావాలి.

– పిట్టల గణేశ్‌, గుండారం, కమాన్‌పూర్‌ మండలం

బాధ్యతగా వేస్తా

నాకు మొదటిసారిగా ఓటు హక్కు వచ్చింది. ఓటేయడాన్ని బాధ్యతగా తీసుకుంటా. ప్రజాసామ్య దేశంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కల్పించిన రాజ్యంగపరమైన హక్కుగా గుర్తించి ఓటును సద్వినియోగం చేసుకోవాలి.

– పిడుగు అంజలి, కమాన్‌పూర్‌

అమ్ముకోవద్దు

ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధాన్ని అమ్ముకోవద్దు. ప్రజలకు సేవ చేసే నిస్వార్థ నాయకుడిని ఎన్నుకోవాలి. విద్య, వైద్య, వ్యవసాయ సంక్షేమానికి కృషి చేసేవారికి ఓటేస్తా.

– కాసు ఆదిత్య సూర్యప్రకాశ్‌, బీటెక్‌, ముత్తారం

1/8

2/8

3/8

4/8

5/8

6/8

7/8

పీపుల్స్‌ ఎజెండా
8/8

పీపుల్స్‌ ఎజెండా

Advertisement
 
Advertisement