‘నా భర్త ఎలా చనిపోయాడో చెప్పండి’ | - | Sakshi
Sakshi News home page

‘నా భర్త ఎలా చనిపోయాడో చెప్పండి’

Jun 16 2023 6:18 AM | Updated on Jun 16 2023 12:20 PM

బైఠాయించిన శ్రీవిద్య, మద్దతుగా తరలివచ్చిన గ్రామస్తులు - Sakshi

బైఠాయించిన శ్రీవిద్య, మద్దతుగా తరలివచ్చిన గ్రామస్తులు

రామగుండం: అంతర్గాం మండలంలోని సోమనపల్లికి చెందిన వార్డు సభ్యురాలు, గర్భిణి ఐట్ల శ్రీవిద్య తన భర్త వేణుగోపాల్‌ మరణానికి కారణాలు తెలిపి, న్యాయం చేయాలంటూ గురువారం అదే గ్రామానికి చెందిన తన భర్త మిత్రుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె వివరాల ప్రకారం.. వేణుగోపాల్‌ మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తూ కుటుంబంతో కలిసి, గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వగ్రామానికి చెందిన ఇద్దరు బాల్యమిత్రులు హైదరాబాద్‌ నుంచి వచ్చారు.

వేణుగోపాల్‌తో కలిసి, గత ఏప్రిల్‌ 21న ఆకెనపల్లి శివారులో మందు పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వేణుగోపాల్‌ గోదావరిఖని వెళ్లలేక సోమనపల్లిలోని సొంతింట్లో నిద్రించేందుకు బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో ఆ వాహనం అదుపుతప్పి, పడిపోవడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. తోటి మిత్రుడు, స్థానికులు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. మూడు రోజులు చికిత్స పొందాక బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కుటుంబసభ్యులు అతన్ని ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో మృతిచెందాడు. అసలు ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి భార్య శ్రీవిద్య కోరుతోంది.

మృతుడికి రెండున్నరేళ్ల బాబు ఉండగా భార్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఆమె ఆందోళన చేపడుతున్న విషయం తెలుసుకున్న అంతర్గాం ఎస్సై బోగె సంతోష్‌కుమార్‌ సోమనపల్లికి చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకొని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగింది. ఆమెకు గ్రామస్తులు మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement