మంథనిరూరల్: ఉపాధి హామీ పథకంలో బోగస్ హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం అమలులో ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఉపాధి పనులకు హాజరయ్యే ప్రతి కూలీ ముఖ చిత్రాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో రోజూ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే అనేక గ్రామాల్లో యాప్‌లో హాజరు నమోదులో సర్వర్ ప్రాబ్లంతో పాటు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పని స్థలాల్లో ఉపాధి సిబ్బంది, కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో జోరుగా మొదలైన పనులు
ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. కాగా, మంథని మండలంలోని 35గ్రామపంచాయతీల్లో 21,677 జాబ్‌కార్డులు ఉండగా 14,012 మంది కూలీలు మాత్రమే పనులకు హాజరు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉపాధి కూలీలకు కేవైసీ పూర్తి చేయగా తాజాగా ముఖ చిత్రాల నమోదుతో హాజరు వేస్తున్నారు.
గతంలో మ్యానువల్ పద్ధతిలో..
గతంలో ఉపాధి పథకంలో పనికి వచ్చే కూలీల హాజరు మ్యానువల్ పద్ధతిలో నమోదు చేసేవారు. ప్రభుత్వం అందించిన రికార్డుల్లో హాజరు నమోదు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో కూలీలు పనికి రాకున్నా హాజరు వేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పని స్థలాల్లో ప్రతి కూలీ ముఖ చిత్రాన్ని నమోదు చేసేలా కొత్త విధానం అమలులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది మార్చి నుంచే ఈ విధానాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో..
ఉపాధి పనులకు వచ్చే కూలీలకు ఉదయం ఒకసారి ముఖచిత్రం నమోదు చేయాల్సి ఉంటుంది. మళ్లీ సాయంత్రం 4 గంటలకు పనికి వచ్చిన కూలీలతో గ్రూపు ఫొటో తీసి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే అనేక గ్రామాల్లో సిగ్నల్స్ సమస్య ఉండటంతో సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. ఒక్కోసారి సిగ్నల్స్‌తో పాటు సర్వర్ సమస్య ఉత్పన్నం కావడంతో పనుల్లో ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
కేవైసీలో తీసిన ఫొటో మాదిరిగానే..
ఉపాధి పథకంలో పని చేసే ప్రతి కూలీకి ఇప్పటికే కేవైసీ పూర్తి చేశారు. అయితే పని స్థలాల్లో హాజరు నమోదు చేసుకునేందుకు వచ్చిన కూలీలు కేవైసీలో ఎలా ఫొటో ఉందో అదే మాదిరిగా ఫొటో ఉంటేనే యాప్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఏ కొంచెం తేడా వచ్చినా అప్‌లోడ్ కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా కంటి ఆధారిత నమోదులో కూడా కొంత సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీలో బోగస్ అరికట్టేలా నూతన విధానం
కూలీల హాజరు నమోదులో మొదలైన సర్వర్ సమస్య
ఒక్కోచోట కంటి ఆధారంగా తీసుకోని క్యాప్చర్
సాంకేతిక సమస్యతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది
సర్వర్ ప్రాబ్లంతో కొంత మినహాయింపు
ఉపాధి కూలీల హాజరు నమోదులో సర్వర్ సమస్య ఉత్పన్నం అవుతుండడంతో అధికారులు కొంత మినహాయింపు ఇచ్చారు. జన్మనరేగా యాప్‌లో మస్టర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ కొత్త విధానంలో సమస్యలు ఉండడంతో సిబ్బంది కొంత ఇబ్బందికి గురవుతున్నారు. కూలీలు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నం.
– సదానందం, ఏపీవో, మంథని
జిల్లాలో..
గ్రామాలు 266
జాబ్‌కార్డులు 1,17,800
కూలీలు 2,46,636


