కోల్‌సిటీ(రామగుండం): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన స్వచ్ఛత డ్రైవ్ నిరంత రం కొనసాగిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఆదివారం ‘సన్ డే– ఫన్ డే’ థీమ్‌తో గోదావరిఖని పుష్కర ఘాట్ వద్ద సోషల్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ, పలువురు కార్పొరేటర్లు, సిబ్బంది గోదావరినదిలో చెత్తచెదారం తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సుమారు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేయించి పుష్కర ఏర్పాట్లు చేయడానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బల్దియా వెనుక ఖాళీ స్థలంలో మేయర్ మొక్కలు నాటారు. నగరపాలక కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సప్తగిరికాలనీలోని ఎస్సీ, బీసీ వెల్ఫేర్ స్కూళ్ల విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధం, తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
నెలకోసారి స్పెషల్ డ్రైవ్
రామగుండం నగరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక అమలు తీరుపై మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరినది తీరంలో నెలకోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. నదిలో వ్యర్థాలు వేయకుండా అవగాహన కల్పించాలని కోరారు.
స్వచ్ఛందంగా 500 మంది..
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 500 మంది స్వచ్ఛందంగా ‘సన్ డే ఫన్ డే’ కార్యక్రమంలో పాల్గొని నదిలో వ్యర్థాలను తొలగించారని కమిషనర్ అరుణశ్రీ వెల్లడించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆద్వర్యంలో ప్రతినిధులు రాజేందర్, సారయ్య నేతృత్వంలో అందరికీ అల్పాహారం వడ్డించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్‌వో ఆంజనేయులు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, అకౌంటెంట్లు రాజ్‌కుమార్, రవితేజ, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


