● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయకాలనీకి వెళ్లే బీటీ రోడ్డు మూలమలుపు వద్ద మరమ్మతు చేయిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం రోడ్డు మూలమలుపును పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్డును సరైన క్రమంలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ రోడ్డు నుంచి సుల్తానాబాద్‌లోని మార్కండేయకాలనీ వరకు రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. కౌన్సిలర్ చింతల రాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఊట్ల వరప్రసాద్, గాదాసు రవి, ఈర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దు
పెద్దపల్లి: ఆకునూరి మురళి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవద్దని తపస్ జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తపస్ డివిజన్ ఇన్‌చార్జి లింగం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. టీచర్ల జీతాల గురించి మాట్లాడిన కమిటీ పీఆర్‌సీ, డీఏల గురించి ఎందుకు సిఫార్సు చేయలేదని, విద్యాకమిటీ నివేదిక తప్పులతడకగా ఉందన్నారు. నూతన విద్యావిధానం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో షరతులు లేకుండా పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించేలా ప్రతీ ఉపాధ్యాయుడికి హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. మూల వేతనంలో పర్సంటేజీలు కట్ చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు ఎలగం కనుకయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిలా ఉపాధ్యక్షులు పవన్, వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సురేందర్, ఐలయ్య, కార్యవర్గ సభ్యులు అంజయ్య, సందీప్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామేశ్వర్, రాజేందర్, సతీశ్‌రెడ్డి, గణేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధికి దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో ఎలక్ట్రికల్ వెహికల్ టూవీలర్ 142 యూనిట్లు, ఒక్కొక్కటి రూ.లక్ష విలువ, సబ్సిడీ 90 శాతం, బ్యాంకు లోన్ 10 శాతం చెల్లించాలి. ఎలక్ట్రికల్ వెహికల్ త్రీ వీలర్, రూ.3లక్షల విలువ, 71 యూనిట్లు, 70 శాతం సబ్సిడీ, లోన్ 30 శాతం, వ్యవసాయ అనుబంధ సోలార్ యూనివర్సల్ పంపు మోటార్, రూ.7వేలు విలువ, యూనిట్లు 15, సబ్సిడీ 70 శాతం, బ్యాంకు లోన్ 30 శాతం చెల్లించాలి. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు) సమర్పించాలి. వయస్సు 21 నుంచి 50 ఏళ్ల లోపు, వ్యవసాయ పథకానికి 21 నుంచి 60 ఏళ్ల లోపువారు అర్హులని, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్ పుస్తకం పత్రాలతో ఈనెల 17 నుంచి 27 లోపు http://tgobmms.cgg. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


