విజయనగరం ఫోర్ట్: విజయనగరంలో ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. 100 పడకల ఆస్పత్రి పూర్తయితే కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని భావించారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం అయితే పూర్తి కాకపోవడంతో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందని పరిస్థితి. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు విశాఖపట్నం ఈఎస్ఐ ఆస్పత్రికి రిఫర్ల్స్ తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాకు మంజూరు చేసిన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రి జిల్లాలో లేక పోవడం వల్ల కేవలం ఓపీ సేవలు మాత్రమే కార్మికులకు అందుతున్నాయి. దీంతో ఇన్పేషేంట్ సేవలు కావాలన్నా, స్పెషాలిటీ వైద్య సేవలు కావాలన్నా విశాఖపట్నంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి పరుగుతీయాల్సిన పరిస్థితి. మా కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత మాదిరి ఆస్పత్రి మంజూరైనా నిర్మాణం పూర్తి చేయక పోవడం వల్ల కష్టాలు తప్పడం లేదని కార్మికులు వాపోతున్నారు.
శిథిలావస్థలో డయోగ్నోస్టిక్ సెంటర్
ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ శిథిలావస్థకు చేరింది. దీంతోవైద్య సిబ్బంది, చికిత్స కోసం కార్మికులు ఆందోళన చెందుతున్నారు. భవనం పెచ్చులు ఊడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈఎస్ఐ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులకు డయోగ్నోస్టిక్ సెంటర్ సేవలే దిక్కుగా నిలిచాయి. కేవలం ఓపీ సేవలే తప్ప ఇన్పేషేంట్ సేవలు అందని పరిస్థితి. ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పిడియాట్రిక్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్ విభాగాలకు సంబంధించి ఓపీ సేవలే అందుతున్నాయి. డయోగ్నొస్టిక్ సెంటర్ కావడం వల్ల మధ్యాహ్నం 3 గంటలకే ఓపీ సేవలు బంద్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏ సేవలు కావాలన్నా మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి. అత్యవసర పరిస్థితి అయితే విశాఖపట్నంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి గాని రిఫరల్ ఆస్పత్రికి గాని వెళ్లాల్సిన పరిస్థితి.
కొన్ని నెలలు పడుతుంది
ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తికావడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.
జీవన్, కార్మిక రాజ్య బీమా సంస్థ, మేనేజర్


