● నిబంధనలు అతిక్రమిస్తే జైలుకే
● పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
● సమావేశంలో కలెక్టర్, ఎస్పీ
విజయనగరం టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా సాగించేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టినట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఎన్నికల్లో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని, వారిపై ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను సృష్టించే వ్యక్తులను పార్టీలకతీతంగా 20వేల మందికి పైగా గుర్తించి, ఇప్పటికి వారి నుంచి రూ. 2 నుంచి రూ. 3 లక్షలకు సొంత పూచీకత్తుగా మండల ఎగ్జిక్యూటివ్ కార్యాలయంలో బాండ్లు తీసుకున్నామన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి నుంచి సొంత పూచీకత్తుగా బాండులో సూచించిన మొత్తాన్ని చెల్లించే విధంగా చర్యలు చేపట్టి, వారిని జైలుకు పంపిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో చెక్పోస్టులను ఏర్పాటుచేసి, వాహన తనిఖీలను నిర్వహిస్తామన్నారు. రైతులు, వ్యాపారస్తులు , ప్రజలు ఎక్కువ మొత్తంలో నగదును తమ అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లే సమయంలో సరైన ఆధారాలు చూపించాలని స్పష్టం చేశారు. చాలా వరకూ ఆన్లైన్ లావాదేవీలు జరిపేందుకు మాత్రమే ప్రాధాన్యత కల్పించాలన్నారు.
సజావుగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో దానికి అనుగుణంగా మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా నిర్వహించేలా ముందస్తు చర్యలను చేపడుతున్నామన్నారు. విజయనగరం మున్సిపాలిటీ ఎన్నికలను అక్టోబరు 28న నిర్వహించాల్సి ఉండగా, అక్టోబరు 27న పట్టణంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 28న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను అక్టోబరు 29న నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరినట్లు చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు పాల్గొన్నారు.
ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేస్తే చర్యలు
అదేవిధంగా ఎటువంటి నిర్ధారణ లేకుండా అసత్యవార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ప్రచురించినా, సర్క్యులేట్ చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బ్యాంకుల్లో విధులు నిర్వహించే ఆయుధాలను మినహాయించి, మిగిలిన వారి నుంచి లైసెన్స్డ్ ఆయుధాలను సీజ్ చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలోనే విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఒక్కసారే నిర్వహించాల్సి రావడం వలన ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ విజయనగర ఉత్సవాలు, పైడితల్లి సిరిమానోత్సవం, మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహిస్తామని, ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.


