చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి(శ్రీరామ్‌నగర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గరివిడి పట్టణానికి చెందిన విద్యార్థిని సింగవరపు లక్ష్మి జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికై ంది. ఈనెల 10 నుంచి 12 వరకు పల్నాడు జిల్లాలోని కారంపూడి బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ రెజ్లింగ్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించింది. దేశ రాజధాని డిల్లీలో అఖిల భారత స్కూల్‌గేమ్స్ సమాఖ్య ఆధ్యర్యంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో ఈ విద్యార్థిని పాల్గొననుంది. జాతీయస్థాయి క్రీడా పోటీలకు లక్ష్మి ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు ఎం.నిర్మల, పీడీ ఉదయ్‌కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ వాండ్రంగి వెంకటేష్, సహాపాధ్యాయులు ఆమెను గురువారం అభినందించారు.
కురుపాం: మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహణాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనపై స్థానికులు అందించిన వివరాల్లోకి వెళ్తే..దుడ్డుఖల్లు గ్రామం నుంచి కురుపాం వైపు ఎర్ర నవీన్, వర్రి దేముడుబాబు బైక్‌పై వస్తుండగా ఎదురుగా కురుపాం మండలం చెరువు కొమ్మవలస గ్రామానికి చెందిన పల్ల రవి పామాయిల్ తోటకు వెళ్తుండగా రెండు బైక్‌లు బలంగా ఢీకొన్నాయి దీంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎర్ర నవీన్‌కు ఎడమచేయి విరగగా, వర్రి దేముడు బాబుకు కుడి కాలు విరిగిందని, పల్ల రవికి ముఖంపై తీవ్రగాయాలయ్యాయని ప్రథమ చికిత్సను అందించిన వైద్య సిబ్బంది తెలిపారు మెరుగైన వైద్యసేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.
బస్సు ఢీకొని ఇద్దరికి..
గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారి సమీపాన గల పాలధార చెరువు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై గురువారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశా వైపు నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు, మండలంలోని రామన్నపేట గ్రామంలో పెళ్లి చూసుకుని ద్విచక్ర వాహనంపై మరుపల్లి వైపు వెళ్తున్న ధనాల గోపి, తుపాకుల వాసు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. రాత్రి సుమారు 10.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ధనాల గోపికి తీవ్ర గాయాలు కాగా, తుపాకుల వాసుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్‌న్స్‌లో విజయనగరంలోని ప్రభుత్వ కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
17 నుంచి రాష్ట్ర స్థాయి
క్లాసికల్ ఓపెన్ చెస్ పోటీలు
విజయనగరం: ఉత్తరాంధ్రల ఇలవేల్పు పైడితల్లమ్మవారి జాతర మహోత్సవాన్ని పురష్కరించుకుని ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం, ఫైర్ చెస్ స్కూల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్లాసికల్ ఓపెన్ చెస్ పోటీలు జరగనున్నట్లు అసోసియేషన్ జిల్లా సీఈఓ కెవి.జ్వాలాముఖి తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఫైర్చెస్ స్కూల్లో నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు మొత్తంగా రూ.50వేల నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అండర్–07,09,11,13 విభాగాలతో పాటు ఓపెన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సెల్‌నంబర్ 7416666567కు కాల్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


