'కార్నెల్ 7' సామూహిక అత్యాచార ప్రకంపనల మధ్య అమెరికాలోని మరో ఉన్నత విశ్వవిద్యాలయంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం సంచలనం రేపింది. 18వేల మంది విద్యార్థులతో అమెరికాలో అగ్రశ్రేణి పరిశోధనా సంస్థ చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో (University of Chicago) క్యాంపస్ సమీపంలోని ఒక ఫ్రాటర్నిటీ హౌస్ (Fraternity House)లో 21 ఏళ్ల యువతి యూనివర్శిటీ విద్యార్థిని కాదు) పై సామూహిక అత్యాచారం జరిగినట్టు కేసు నమోదైంది.
అక్టోబర్ 11 ఆదివారం తెల్లవారు జామున సుమారు 1:50 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. ఫ్రాట్ హౌస్ బాత్రూమ్లోనే తనపై అత్యాచారం జరిగిందని, ఆ సమయంలో తలుపు బయట కొందరు పురుషులు "నా వంతు ఎప్పుడు?", "నన్ను లోపలికి రానివ్వండి" అని కేకలు వేశారంటూ ఆమె పోలీసుల ముందు వాపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆమెపై బాధితురాలి స్నేహితురాళ్లు ఇదే విషయాన్ని ధృవీకరించారు. కార్నెల్ యూనివర్శిటీలోని ఒక ఫ్రాటర్నిటీ హౌస్లో జరిగిన సామూహిక అత్యాచారం ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో, లైంగిక వేధింపుల కేసులను కళాశాలలు, విశ్వవిద్యాలయాల నిర్వహణ తీరుపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ సంఘటన మరింత దిగ్భ్రాంతి రేపింది.
చికాగో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుల కోసం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిపైనా అభియోగాలు మోపలేదని చికాగో పోలీసులు తెలిపారు. అయితే, అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. అయితే అతడు తమ విద్యార్థి కాదని, లేదా పాఠశాలతో మరే విధంగానూ సంబంధం లేదని కూడా తెలిపారు.
ఇదీ చదవండి: అయ్యో...ట్రెడ్మిల్ మీదే కుప్పకూలి..! వైరల్ వీడియో
మరోవైపు క్యాంపస్ సమీపంలోని ఆల్ఫా ఎప్సిలాన్ పై (Alpha Epsilon Pi) ఫ్రాటర్నిటీ హౌస్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సదరు సంస్థ తమ చికాగో చాప్టర్కు సంబంధించిన అన్ని ఈవెంట్లను, కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసింది. యూనివర్శిటీకి చెందిన సీసీటీవీ కెమెరాలు, లైసెన్స్ ప్లేట్ రీడర్ల ద్వారా సేకరించిన వీడియోఆధారాలను, కీలక సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు షికాగో పోలీస్ డిపార్ట్మెంట్కు (CPD) అందించారు.ఈ దర్యాప్తుకు తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వారు ప్రకటించారు.
ఇదీ చదవండి: జర్మనీలో అగ్నిప్రమాదం : ముగ్గురు భారతీయులు సజీవ దహనం


