● రెవెన్యూలో విచిత్ర విన్యాసాలు
● జూనియర్లకు తహసీల్దార్ బాధ్యతలు
● ఎన్నికల వేళ ఆందోళన
విజయనగరం గంటస్తంభం: జిల్లా రెవెన్యూ శాఖలో వింత పోకడలు జోరందుకున్నాయి. మండల స్థాయిలో అత్యంత కీలకమైన తహసీల్దార్ పోస్టుల నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. అర్హత, అపార అనుభవం కలిగిన సీనియర్ అధికారులను పక్కనపెట్టి, రీసర్వే కోసం నియమించిన జూనియర్ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ల(ఆర్‌ఎస్‌డీటీ) చేతుల్లోకి తహసీల్దార్ బాధ్యతలు వెళ్లిపోవడం రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక చోట పోస్టింగ్..ఇంకోచోట బాధ్యతలు
జిల్లాలోని పలు మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు లేకపోవడం, ఉన్నవారిని ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లపై తిప్పడం సర్వసాధారణమైపోయింది. వంగర, రేగిడి మండలాలకు పూర్తిస్థాయి తహసీల్దార్లు లేకపోవడంతో ఆర్ఎస్డీటీలకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. వంగర తహసీల్దార్‌గా శివనాగజ్యోతిని నియమించినప్పటికీ, ఆమెను చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా డిప్యుటేషన్‌పై పంపారు. సీఎస్‌డీటీపై వేటు పడడంతో చివరకు ఆర్‌ఎస్‌డీటీ శ్రీనివాసరావుకు బాధ్యతలు వచ్చాయి. రేగిడిలోనూ కృష్ణలత రిలీవ్ కావడంతో ఆర్‌ఎస్‌డీటీ ఈశ్వరరావుకే తహసీల్దార్ బాధ్యతలు కట్టబెట్టారు.
పదోన్నతులు వచ్చినా పోస్టింగులు శూన్యం
గత జూన్ 24న విశాఖపట్నం నుంచి స్వర్ణబాయికి గంట్యాడ తహసీల్దార్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఆమెను చీపురుపల్లిలో పనిచేస్తున్న సూర్యకాంతం స్థానంలో గంట్యాడకు డిప్యుటేషన్‌పై ఉంచి, కలెక్టరేట్లోనే కొనసాగిస్తున్నారు. మరోవైపు కొద్ది నెలల క్రితం తహసీల్దార్ నుంచి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన పద్మావతికి ఇప్పటివరకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. భోగాపురం, విజయనగరం రూరల్ మండలాల్లోనూ డిప్యుటేషన్ల పర్వమే సాగుతోంది.
ఎన్నికల వేళ తప్పిదాలు జరిగితే ఎవరిది
బాధ్యత?
గతంలో రీసర్వేలో భూసరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌డీటీ పోస్టులను సృష్టించి సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలకు పదోన్నతులు కల్పించారు. వీరికి పరిపాలనాపరంగా అనుభవం తక్కువగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అనుభవం లేని వారితో కీలక కార్యకలాపాలు నడిపించడం వల్ల తీవ్ర లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తప్పనిసరి పరిస్థితుల్లోనే అప్పగించాం
ఈ అంశంపై జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) సీహెచ్ సత్తిబాబు వివరణ ఇస్తూ..తహసీల్దార్ స్వర్ణబాయికి డిప్యూటీ కలెక్టర్ వద్ద పోస్టింగ్ చూపించామని, పద్మావతికి కూడా తగిన బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్‌ఎస్‌డీటీలకు తహసీల్దార్ బాధ్యతలు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.


