● జీఓ 250 రద్దు చేయాలని పరిరక్షణ కమిటీ డిమాండ్ ● ఫ్యాక్టరీ ఆస్తుల పరిరక్షణకు న్యాయ పోరాటానికి సిద్ధం
గజపతినగరం రూరల్ (జామి): జామి మండలంలోని భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిరక్షణకు పోరాటాన్ని ఉధృతం చేయాలని ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. ఫ్యాక్టరీ లిక్విడేష న్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 250ను తక్షణమే రద్దు చేసి, కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తులను సహకార రంగంలోనే పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. జామి మండల కేంద్రంలోని సీతారామ కల్యాణ మండపంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ తీరును కమిటీ సభ్యులు తప్పుబట్టారు. కార్మికుల బకాయిల చెల్లింపును స్వాగతిస్తూనే, ఫ్యాక్టరీ ఆస్తు ల విక్రయానికి దారితీసే చర్యలను వ్యతిరేకించారు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఫ్యాక్టరీని ఆధునీకరించి, సహకార రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె రవికుమార్ మాట్లాడుతూ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా లిక్విడేషన్ చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. దీనివల్ల రైతులు, షేర్‌హోల్డర్లు, కార్మికులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ 250ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు గులిపిల్లి జయపాల్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ లిక్విడేషన్ చర్యలను అడ్డుకునేందుకు అవసరమైతే న్యాయపోరా టం చేపడతామని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ ఆస్తులు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వర్గా లను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు.
తాత్కాలిక పోరాట కమిటీ ఏర్పాటు...
భీమసింగి సుగర్స్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం తాత్కాలిక పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా పాండ్రంకి సంజీవి, కో–కన్వీనర్లుగా బి. రాంబాబు, లగుడు దేవుడు, కోశాధికారిగా రాయవరపు సత్యం, సలహాదారుగా గులిపిల్లి జయపాల్‌ను ఎన్నుకున్నారు. అనంతరం పోరాట కమిటీ సభ్యు లు శాసనమండలి విపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం నియోజ కవర్గ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను కలిసి ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు కోరా రు. ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కమిటీ చేపట్టే పోరాటానికి అవసరమైన సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మామిడి రైతుల సంఘం జిల్లా నాయకుడు లగుడు దేవుడు, మాజీ వైస్ ఎంపీపీ గేదెల వెంకట్రావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణమూర్తి, రైతు సంఘం గంట్యాడ మండలాధ్యక్షుడు కోడెల శ్రీను, మల్లయ్య, విసినిగిరి మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.


