న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 25 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● తుపాను తీరం దాటిన సమయంలో జిల్లాలో భారీ వర్షాలు ●బలిజిపేట, పాలకొండ, సీతంపేటల్లో అత్యధికం ● తీవ్ర వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి.. ●పార్వతీపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయం ● విద్యార్థుల వసతి గృహంలోకి చేరిన నీరు ●ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలి: కలెక్టర్
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలోను, పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిపై ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న(ఎస్‌జీఎల్) తోటపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవా హం వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం బ్యారేజీవద్దకు సగటున 8,238 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈమేరకు స్పిల్‌వేద్వారా 7,865క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 105 మీటర్లకు గాను 103.52 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.650 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి ప్రధాన కాలువద్వారా నీటి సరఫరాను పూర్తిగా నిలుపుదల చేయగా, పాత కుడికాలువద్వారా 50 క్యూసెక్కులు, పా త ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారి బి.కిషోర్‌కు మార్ పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాలూరు: చినుకు పడిందంటే చాలు మండలంలోని పారన్నవలస ప్రజల్లో గుబులు మొదలవుతుంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నా వర్షం మొదలైనా తమ గ్రామానికి రాకపోకలు ఎలా ఉంటాయోన్న ఆందోళన వారిని వెంటాడుతుంది. సాలూరు పట్టణానికి సమీపంలో ఉన్నప్పటికీ, వర్షాలు పడితే మాత్రం రవాణా సౌకర్యానికి గ్రామస్తులకు అవస్థలు తప్పవు.
రాకపోకలకు అవస్థలే..
పారన్నవలస గ్రామానికి ఒకవైపు వేగావతి నది, మరోవైపు కూరగెడ్డ ఉండడంతో వర్షాకాలంలో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. కూరగెడ్డపై వంతెన నిర్మాణానికి 2023లో నాటి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో గ్రాంటు తీసుకువచ్చారు. తరువాత ఎన్నికలు రావడం కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో నేటికీ పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమ అవసరాల కోసం స్థానికంగా బెంచీలు, కర్రలు వంటి వాటితో తాత్కాలిక నడక వంతెన ఏర్పాటుచేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. దీనిమీద గానే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అతికష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. పాలకులు ఇకనైనా స్పందించి ఈ వంతెన నిర్మాణం పూర్తిచేయించి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.
విజయనగరం అర్బన్: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయయాలని, ప్రాఫిట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) అందరికీ సమానంగా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు గురువారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు విజయనగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద చేపటిన నిరసన ప్రదర్శనలో ఉద్యోగులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. డిమాండ్లు వినిపించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. జిల్లాను ముంచేసింది. ఆర్నాబ్ తుపాను కళింగపట్నం వద్ద తీరం దాటిన సమయంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాలులతో పాటు.. వర్ష తీవ్రత పెరిగింది. జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ 50.8 మి.మీ. సగటు వర్షపాతం కురిసింది. సీతంపేటలో 156 మి.మీ, పాలకొండలో 103 మి.మీ చొప్పున నమోదైంది. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే 41.2 మి.మీ. వర్షం కురవడం విశేషం. అత్యధికంగా బలిజిపేట మండలంలో 117.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా ఇక్కడే తీవ్రత ఎక్కువ ఉండటంతో బలిజిపేట – పెదపెంకి మార్గంలోని రహదారులు, పొలాలు జలమయం అయ్యాయి. పెదపెంకి గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల కోసం తవ్విన కాలువల్లో నీరు పొంగి.. ఇళ్లను ముంచెత్తాయి. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఇతర అధికారులు పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి తుపాను ప్రభావాన్ని, సహాయక చర్యలను కలెక్టర్ సమీక్షిస్తూ తగు సూచనలు జారీ చేశారు. నిరంతర వర్షాల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ పడిపోయాయి. పొలాలు నీటితో నిండిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి.
●పాలకొండ, సీతంపేట మార్గంలో రహదారికి అడ్డంగా చెట్లు కూలాయి. పాలకొండ సమీపంలో సుమారు 150 ఏళ్ల నాటి మర్రి చెట్టు కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. గుమ్మలక్ష్మీపురం సబ్ స్టేషన్ దగ్గర సమస్య రావడంతో మండలం అంతా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గాలులు, వర్షానికి జిల్లాలోని చాలా గ్రామాలు విద్యుత్తు నిలిచి అంధకారంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలు, పాత ఇళ్లలోని దాదాపు 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి, ఆహారం కల్పించారు.
●ఎగువన వర్షాల కారణంగా జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. నాగావళికి వరద ప్రవాహం పెరిగింది. గురువారం ఉదయం సమయానికి తోటపల్లి బ్యారేజీకి 5,912 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయ్యింది. ముందస్తు జాగ్రత్తగా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పెద్దగెడ్డ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం నిలకడగా ఉంది. వర్షాల వల్ల రోడ్లు, గుంతలు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పిల్లలను బయటకు రానివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని, ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే కాల్ సెంటర్‌కు గానీ, స్థానిక సచివాలయ సిబ్బందికి గానీ సమాచారం అందించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
28 చెరువుల్లో అలెర్ట్
జిల్లాలోని 9 మండలాల్లో ఉన్న 45 చెరువుల నీటిమట్ట స్థితిపై నీటిపారుదల శాఖ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 28 చెరువులు ప్రమాదకర నీటిమట్టానికి చేరుకోవడంతో వాటికి ’అలర్ట్’ ప్రకటించారు. 4 మండలాల్లోని 6 చెరువులు ‘ప్రమాదకర’ స్థాయిలో, మరో 4 మండలాల్లోని 11 చెరువులు ’కాషన్’ (పరిశీలన) పరిధిలో ఉన్నాయి. బలిజిపేట మండలంలో అత్యధికంగా 18 చెరువులు ప్రభావితమయ్యాయని, ఇందులో 12 చెరువులు అలర్ట్‌లో ఉన్నాయి. ప్రభావిత మండలాల్లో చెరువులకు గండ్లు పడకుండా, ప్రమాదాలు జరగకుండా నీటిపారుదల, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
నాది సీతానగరం మండలం అంటిపేట పంచాయతీ రెడ్డివానివలస గ్రామం. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు 18ఎల్ కాలువ పరిధిలో 4 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగుచేశాను. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.27వేల వరకు ఖర్చుచేశాను. అధికారుల నిర్లక్ష్యంతో లచ్చయ్యపేట–అంటిపేట గ్రామాల మధ్య గురువారం మధ్యాహ్నం కాలువకు గండిపడింది. పంటంతా ముంపునకు గురైంది. పరిహా రం అందుతుందోలేదోనని బెంగగా ఉంది. ఆదుకోకుంటే నిలువునా మునిగిపోతాం.
– రెడ్డి తవిటినాయుడు, రైతు, రెడ్డివానివలస
బలిజిపేట: పెదపెంకి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇంటా, బయటా, చుట్టూ వరదనీరు కమ్మేసింది. గ్రామంలో ఇప్పటికే మ్యాజిక్ డ్రైన్‌ల వల్ల నీరు ప్రవహించక నివాసగృహాల్లోకి నీరుచేరి ప్రజలు ఇక్కట్లు పడుతుంటే.. తుఫాన్ ప్రభావంతో గ్రామమంతా జలమయమైందని, పంటపొలాలు నీటమునిగి పోయాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాగునీరు లేక ఆలస్యంగా ఉభాలు జరిపామని, ఇప్పుడు తుఫాన్ వర్షాలు పంటను ముంచేశాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీ, రెల్లివీధుల్లో ఉండే నివాస గృహాల్లోకి వరద చొరబడడంతో ఇబ్బందులు పడ్డారు. కాపువీధి, నాయుడువీధిలోని పలు నివాసగృహాలను ఖాళీ చేశారు. బంకురు వీధిలో కాలువనీరు నివాసగృహాల్లోకి చేరడంతో నీటిని గిన్నెలతో తోడుతున్నారు. మ్యాజిక్ డ్రైన్‌లలో నీరు పారకుండా నివాసగృహాల్లోకి చేరుతుండడంతో గ్రామస్తులు కాలువల్లో ఉండే రాయిపిక్కలను తొలగించారు. పెదపెంకి చుట్టూ నీరు చేరడంతో రాత్రి సమయాల్లో విషసర్పాలు వచ్చే అవకాశాలున్నాయని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
నీటమునిగిన పెదపెంకిలోని పంటపొలాలు


