రాష్ట్రంలో.. ఎల్లోనినో ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో.. ఎల్లోనినో ఎఫెక్ట్‌

Sep 19 2026 12:52 AM | Updated on Sep 19 2026 12:52 AM

రాష్ట్రంలో.. ఎల్లోనినో ఎఫెక్ట్‌ ● చంద్రబాబు నిర్వాకం వల్లే కరువు పరిస్థితులు ● ముందస్తు కార్యాచరణలో పాలనా యంత్రాంగం విఫలం ● కమీషన్లు మాట్లాడుకోవడానికే జిల్లా ప్రజా ప్రతినిధుల సమీక్షలు పరిమితం ● విద్యుత్‌ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టదా? ● రైతులు, ప్రజలకు అండగా ఉంటాం.. ● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు రైతులకు మేలు చేసే ఆలోచన ఉందా? ప్రజలు, రైతుల తరఫున వైఎస్సార్‌ సీపీ డిమాండ్లు ఇవే.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.. వాటర్‌ మ్యాన్‌ కాదు.. ‘మ్యాన్‌ మేడ్‌ కరవు’...

● చంద్రబాబు నిర్వాకం వల్లే కరువు పరిస్థితులు ● ముందస్తు కార్యాచరణలో పాలనా యంత్రాంగం విఫలం ● కమీషన్లు మాట్లాడుకోవడానికే జిల్లా ప్రజా ప్రతినిధుల సమీక్షలు పరిమితం ● విద్యుత్‌ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టదా? ● రైతులు, ప్రజలకు అండగా ఉంటాం.. ● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో కరవు పరిస్థితులు పొంచి ఉన్నాయని.. ఇది ఎల్‌నినో ప్రభావం కాదని.. ‘ఎల్లోనినో ఎఫెక్ట్‌’ అని వైఎస్సా ర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరవు మాత్రమే కాదని.. ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం, ప్రజా ప్రతినిధుల వైఫల్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. ఎల్‌ నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే సీఎం చంద్రబాబు వెల్లడించారని.. వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడంలో ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టలేదని గుర్తు చేశారు. నేడు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని.. ప్రభుత్వ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు ఏం చేయాలో తెలియక, ఎండుతున్న పంటలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఖరీఫ్‌ వరి సాధారణ విస్తీర్ణం 72,829 హెక్టార్లు కాగా.. ప్రభుత్వం మాటలు నమ్మి, ఆలస్యంగానైనా సాగుకు సిద్ధమైన రైతులు నీటి తడులు లేక, దిగులు చెందుతున్నారని తెలిపారు. అధికారుల లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నా యన్నారు. ఖరీఫ్‌కు ఉపయోగపడే జూన్‌ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, మక్కువ, బలిజిపేట, సాలూరు, పాచిపెంట మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. సీతానగరం, భామిని మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందన్నారు.

●జూన్‌ నుంచి నేటి వరకూ జిల్లాలో 677.2 మి.మీ సగటు వర్షపాతం కురవాల్సి ఉండగా.. 414.8 మి.మీ. మాత్రమే పడిందని.. 38.8 మి.మీ లోటు ఉందని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో అధిక మండలాలు కరవు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని చెప్పారు.

●దాదాపు 11 వేల హెక్టార్లలో సుమారు 18 వేల మంది రైతులు మాత్రమే పంటల బీమాలో నమోదు కావడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఇది కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని తెలిపారు. రైతులను చైతన్యం చేయడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు.

●వరుసగా మూడు నెలలు వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం, జిల్లా ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించలేదని, కరవు

మండలాల ప్రకటన కోసం కనీసం ప్రతపాదనలు అయినా పంపారా? అని ప్రశ్నించారు. కరవు ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదని, పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదని, కనీసం ఉపాధి హామీ అదనపు పనిదినాలు కూడా కోరలేదని గుర్తు చేశారు. జిల్లాలో అధికారులతో మంత్రుల సమీక్షలన్నీ వారి కమీషన్ల కోసం మాట్లాడుకోవడానికి, పోట్లాడుకోవడానికి తప్ప.. ఆచరణలో చేపట్టే పనులేవీ లేవని విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి గానీ, జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు గానీ, ఇన్‌చార్జి మంత్రి అయిన వ్యవసా య శాఖ మంత్రికి గానీ రైతులకు మేలు చేసే ఆలోచన ఉందా? అని పరీక్షిత్‌ రాజు ప్రశ్నించా రు. ఎక్కడా ముందస్తు ప్రణాళిక లేదన్నారు. రైతు భరోసా కింద పీఎం కిసాన్‌ కాక, ఇస్తానని చెప్పిన రూ.20 వేలు అన్నదాత సుఖీభవ మొ త్తం ఇవ్వలేదన్నారు. ఈ మూడేళ్లలో ఆ పథకంలో మొత్తం రూ.60 వేలు ఇవ్వాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే అని గుర్తు చేశారు. ఒక్కో రైతుకు రూ.41 వేలు బాకీ పడ్డారని తెలిపారు. కనీసం రైతులకు ఈ సమయంలో ఇచ్చినా భరోసాగా ఉండేదన్నారు. ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఊసే లేదని, సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారని చెప్పారు. మొంథా, ఇతర తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు నిబంధనల పేరు చూపి, ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. ఇక జిల్లాలో కరెంటు కోతలకు అంతే లేదని.. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్తు సరఫరా నిలుపు చేస్తున్నారని తెలిపారు. ఓ వైపు వేసవిని తలపిస్తున్న వాతావరణం, మరో వైపు ఈఎల్‌ఆర్‌ పేరిట కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వం వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని పరీక్షిత్‌ రాజు డిమాండ్‌ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లకు ఎగ్గొట్టిన రూ.41 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపచేయాలని.. వారికి మూడేళ్లకు కలిపి ఒక్కో రైతుకు రూ.60 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. రైతులకు సున్నా వడ్డీ కింద గత ప్రభుత్వ హయాంలో ఏ మాదిరిగా ఇచ్చేవాళ్లమో, అదే మాదిరిగా ఈ మూడేళ్లకు సంబంధించి కూడా సున్నా వడ్డీ వర్తింపచేయాలని కోరారు. పశుగ్రాసం ఉచితంగా రైతులకు అందజేయాలన్నారు. కరువు వల్ల వ్యవసాయ పనులకు దూరమైన కూలీలకు అదనపు ఉపాధి పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు చెల్లించాలని.. తద్వారా రైతులకు, వారి పిల్లలకు తోడుగా నిలవాలని కోరారు. జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని.. పార్వతీపురం వంటి పట్టణాల్లో బురద నీరు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారని.. ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేయాలన్నారు.

ప్రజలు, రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ కచ్చితంగా ఉంటుందని పరీక్షిత్‌ రాజు తెలిపారు. వీటన్నింటిపైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రైతుల సమస్యలపై ప్రజల్లోనూ అవగాహన పెంచి, ప్రభుత్వం దిగి వచ్చేలా ఉద్యమాలకు సిద్ధం అవుతామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్‌ మ్యాన్‌ కాదనీ... ‘మ్యాన్‌ మేడ్‌ కరువు’ అని పరీక్షిత్‌ రాజు విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడనున్నట్లు గత ఫిబ్రవరిలోనే హెచ్చరికలు ఉన్నా.. ముందస్తు కార్యాచరణ లేకపోవడం దురదృష్టకరం అన్నారు. జిల్లా పరిస్థితుల రీత్యా మున్ముందు వర్షాలు కురవకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందని, తిండి గింజలకు కూడా కష్టం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పంటల బీమా ఉండి ఉంటే, సాగు చేయని రైతుకు ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రివెంటివ్‌ సోయింగ్‌ కింద ఇన్సూరెన్స్‌ వచ్చేదని గుర్తు చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం అందేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో కూడా నీరు లేని పరిస్థితి నేడు ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement