సాక్షి, పార్వతీపురం మన్యం :
జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలు సర్వసాధారణం అవ్వడం ఆందోళన కలిగించే విషయమే. ప్రభుత్వ పాఠశాలలతో పోల్చుకుంటే ఆశ్రమ విద్యాలయాలు, గురుకులాల్లో పిల్లల మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కారణాలేదైతేనేం.. విద్యాలయాల్లో పర్యవేక్షణ, క్రమశిక్షణ దారి తప్పుతోందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొండకోనలను వదిలి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో దూరంగా వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు.. విగతజీవులుగా మారిపోతుండటం కలవరపెట్టే అంశమే. ఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తున్న యంత్రాంగం.. పరిహారం ప్రకటనతో సరిపుచ్చుకుంటున్న ప్రభుత్వం.. పిల్లల తల్లిదండ్రుల కన్నీటి ఘోషకు సమాధానం చెప్పడం లేదు. వారి కడుపుకోతకు విలువ కట్టడం లేదు. అప్పటి వరకు ఆడుతూపాడుతూ గడిపిన తమ చిన్నారుల మరణ వార్త ఆ కుటుంబంలో చీకట్లు నింపుతోంది. తమ బిడ్డలు అకస్మాత్తుగా ఎందుకు మరణిస్తున్నారో తెలియక భోరున విలపిస్తున్నారు. గతేడాది కురుపాం గురుకుల పాఠశాల బాలికలు పచ్చకామెర్లతో మృతి చెందితే.. కనీసం పరిహారం కూడా ఇవ్వలేని అచేతన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. జరిగిన ఘటనకు విచారణ వ్యక్తం చేసిన మంత్రులు, ఉన్నతాధికారులు.. తర్వాతయినా అటువంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారా? అంటే అదీ లేదు.
ఏటా పదుల సంఖ్యలోనే మృత్యువాత
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు 64 ఉన్నాయి. సుమారు 28 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో సుమారు 37 వేల మంది వరకు విద్యార్థులున్నారు. మొత్తం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,507 ఉండగా.. ఇక్కడ 87 వేల మంది వరకు చదువుతున్నారు. ఒక్కో విద్యాసంస్థలో వందలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు అనారోగ్యం, ఇతర కారణాలతో తరచూ మృత్యువాత పడుతున్నారు. మన్యం జిల్లాలో ఇటువంటి ఘటన నెలకు ఒక్కటైనా బయటపడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధిక శాతం మంది విద్యార్థుల్లో ఆ తల్లిదండ్రులకు లేకలేక కలిగిన సంతానమే కావడం యాదృచ్ఛికంగా జరుగుతున్నా.. వారి కడుపు కోతకు ప్రభుత్వ యంత్రాంగం ఏం సమాధానం చెబుతుంది?
సిఫారసుల సిబ్బంది.. పెత్తనంతోనే విధి!
ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఎక్కువ మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ప్రాతిపదికనే పని చేస్తున్నారు. వీరంతా అధికార పార్టీ సిఫారసుతోనే విధుల్లో చేరుతున్నారు. రెగ్యులర్ హెచ్‌ఎంలు, వార్డెన్లు కూడా ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి, కోరుకున్న స్థానంలో తిష్ట వేస్తున్నారు. వీరిలో కొంతమంది అధికార పార్టీ పేరు చెప్పుకొని విద్యాలయాల్లో రుబాబు చేస్తున్నారు. అసలు విధులను పక్కనపెట్టి, విద్యార్థులపై పెత్తనం చేస్తున్నారు. ఒకరో, ఇద్దరో నిజాయితీగా పని చేసిన ఉద్యోగులున్నా.. ఇమడనీయడం లేదు. పిల్లలకు పెట్టాల్సిన ఆహారాన్ని అరకొర చేసి, సరకులను పక్కదారి పట్టిస్తున్నారు. మక్కువ మండలం అనసభద్ర ఘటనకు సంబంధించి విద్యాలయంలో ఓ ఉద్యోగిని.. తాను మంత్రి మనిషినంటూ హడావిడి చేస్తారని వినికిడి.
పిల్లలకు ఇక్కడ సరైన ఆహారం కూడా పెట్టడం లేదు. ఆమె పెట్టినంతే తినాలి. వండిందే మెనూ! సరకులు పక్కదారి పడుతున్నాయని విద్యార్థులే చెబుతున్నారు. కురుకుట్టి పాఠశాలలోనూ పిల్లలకు వండి పెట్టాల్సిన ఆహార పదార్థాలు రహస్యంగా తరలిపోతుండగా గ్రామస్తులు గతంలో పట్టుకున్నారు. కరాసవలస కేజీబీవీ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలతో హడావిడి చేసిన మంత్రి సంధ్యారాణి.. అక్కడి ఎస్‌వో ప్రశాంతితోపాటు, పలువురి సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అదే పరిస్థితి అనేకచోట్ల ఉన్నా.. ఎందుకు తనిఖీలు చేయడం లేదు, వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నాయి.


