● గిరిజన విద్యార్థి ఆర్పిత్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి ● పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి
సీతంపేట: గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న ఆదివాసీ బిడ్డలకు రక్షణ కరువైందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ‘మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్యమోడల్ రెసిడెన్షి యల్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న సీతంపేట మండలం ఎర్రన్నగూడ గ్రామానికి చెందిన సవర అర్పిత్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వెనుక కారణమేమిటన్నది సమగ్ర దర్యాప్తు చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గిరిజన విద్యను గాడిలో పెట్టాల్సిన గిరిజన మంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. గిరిజన విద్య, సంక్షేమంపై నిర్లక్ష్యం తగదన్నారు. తమ పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపిస్తే వారి ఆశలను అడియాశలు చేసి ఇళ్లకు మృతదేహాలను పంపిస్తున్నారన్నారు. బడికి పంపితే తమ పిల్లలు ఏమైపోతారోననే ఆందోళన ఇప్పుడు తల్లిదండ్రుల్లో మొదలైందన్నారు. గిరిజన విద్యార్థులకు పాఠశాలల్లో భద్రత కరువైందన్నారు. ప్రతి విద్యార్థి ప్రాణానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేదంటే పోరాటాలు తప్పవని ప్రకటనలో హెచ్చరించారు.


