● అర్హత ఉన్నా.. ప్రజాప్రతినిధి సిఫారసు ఉంటేనే పథక ప్రయోజనమా?
సాక్షి, పార్వతీపురం మన్యం:
అనాథ, నిరాశ్రయ పిల్లలకు అండగా నిలవాల్సిన పథకంలో రాజకీయ జోక్యం కలవరపెడుతోంది. అమ్మానాన్నలను కోల్పోయి.. ఆదరణ కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలి. అందుకు భిన్నంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పరిస్థితి ఉంది. అనాథలు, నిరాశ్రయులు, తల్లిదండ్రుల సంరక్షణకు దూరమై న చిన్నారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం క్షేత్రస్థాయిలో కొత్త వివాదాలకు కేంద్రంగా మారుతోంది. పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ.. ప్రజాప్రతినిధుల సిఫారసు ఉంటేనే తమకు అవకాశం కల్పిస్తున్నారంటూ కొందరు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అసలే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు.. పిల్లల సంరక్షణ, విద్య, పోషణ భారాన్ని మోయలేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుంటాయి. అలాంటి వారికి పథకం అండగా నిలవాల్సి ఉండగా.. ‘ఎవరి సిఫారసు ఉంది?’ అనే ప్రశ్న ఎదురవుతోందని వారు వాపోతున్నారు.
మిషన్ వాత్సల్య లక్ష్యం పిల్లల రక్షణ, సంరక్షణ, అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించడం. తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారుల చదువు, పోష ణ నిమిత్తం ఈ పథకం కింద ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ నిధులను ఆరు నెలలకు ఒకసారి రూ.24,000, ఏడాదికి మొత్తం రూ.48,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. తొలి దశలో ఎంపికై న అనాథలతో పాటు తల్లి లేదా తండ్రిని కోల్పోయినవారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి పిల్లలు, యాసిడ్ బాధితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ పథకం కింద అందించే మొత్తం నిధులలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం భరిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతం వాటాను అందిస్తోంది. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హతను పరిశీలించి లబ్ధిదారు లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయ న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నప్పటికీ తమకు సాయం అందడం లేదని, ప్రజాప్రతినిధి సిఫారసు ఉన్నవారికే ప్రాధాన్యం లభిస్తోందని కొన్ని కుటుంబాలు చెబుతున్నాయి.
సామాజిక భద్రత అవసరమైన చిన్నారులను రాజకీయ ప్రాతిపదికన కాకుండా.. అర్హత ఆధారంగా గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పథకం ఉద్దేశమే పిల్లల హక్కులను పరిరక్షించడం, వారికి మెరుగైన జీవనావకాశాలు కల్పించడం. అలాంటి పథకంలో ప్రజా ప్రతినిధుల సిఫారసులకే ఐసీడీఎస్ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
●విజయనగరం జిల్లాలో 500కు పైగా కొత్త దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు... నిధులు విడుద ల కాకపోవడం వల్ల ఆలస్యం అవుతోందన్న సమాధానం సంబంధిత ఐసీడీఎస్ అధికారుల నుంచి వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధుల సిఫారసు ఉన్న వారికి.. కాస్త శాఖాధికారులతో పరిచయం ఉన్నవారికి, పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారికి పాత వారి తో కలిపి జాబితాను ‘సర్దుబాటు’ చేసేస్తున్నారు.
●పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యేలకు జాబితా అందించాలని నేరుగా ఐసీడీఎస్ అధికారులే సిబ్బందికి సూచిస్తున్నారు. నియోజక వర్గానికి 20 దరఖాస్తులను వారి దృష్టిలో పెట్టి, వారు అంగీకరించిన మీదటే సీడబ్ల్యూసీ ముందుకు తీసుకు వెళ్లాలని చెబుతున్నారు. వందల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. కేవలం 20 చొప్పున ఎంపిక చేసి ఇవ్వాలని చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీనివల్ల నాలుగు నియోజక వర్గాల్లో 80 దరఖాస్తులకు మించి మోక్షం కలగదు. ఈ పథకం కింద 2020–27 సంవత్సరానికి అనాథలు, హెచ్‌ఐవీ ప్రభావితులు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యే క పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు నెలకు రూ.4,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు గత జూన్ నెలలో ప్రకటన విడుదల చేశారు. సిఫారసులు, రాజకీయ పలుకుబడికి చోటు ఉంటే అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ‘పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన పథకం.. పెద్దల సిఫారసులపై ఆధారపడాల్సిందేనా?’ అన్న ప్రశ్న జిల్లావాసుల నుంచి వినిపిస్తోంది. అధికారు లు స్పందించి అర్హులకు పథకం అందేలా చూడాల న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


