● అధికారుల వివరణతో ప్రజల్లో వ్యక్తం అవుతున్న అనుమానాలు
పాచిపెంట: మండలంలోని పోతులగెడ్డ సమీపంలో పిండ్రంగివలస రహదారి అంశంపై సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో సంబంధిత శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ సూర్య సుబ్రహ్మణ్య శర్మ వివరణ ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణ అసలు ప్రశ్నకు పొంతన లేకుండా ఉందని స్థానికులు అంటున్నారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వ రహదారి ప్రైవేట్ వెంచర్‌లో కలిసిందా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రహదారి మార్గాన్ని మార్చి ఉంటే.. ఎవరి అనుమతితో మార్చారు? పాత రహదారి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ప్రజలు సంతకాలు చేసి పంచాయతీ తీర్మానం ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అధికారులు ధారాదత్తం చేయవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది ఉందా? లేదా? అన్నది ఇక్కడ ప్రధాన సమస్య కాదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ రహదారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? లేదా? అన్నదే తమ ప్రశ్న అని, ఈ వ్యవహారంపై అధికారులు ఆధారాలతో సహా స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.


